చంద్రబాబు అరెస్టు మంచి పనో కాదో వచ్చే ఎన్నికలలో తెలుస్తుంది: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు ని అరెస్ట్ చేశారని టిడిపి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు అవినీతిపై మండిపడుతున్నారు.
అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అవినీతి, అక్రమాలతో ప్రజల సొమ్ము దోచేశారు అని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబు చేసిన స్కాములు అన్నింటిలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చాలా చిన్నదని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విమర్శించారు.

చంద్రబాబు ఇప్పటివరకు ఎన్నో స్కాములు చేశారని, అవి ఇప్పటివరకు బయటకు రాలేదని, వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేశారని, కానీ ఇకనుంచి చంద్రబాబు స్కాములు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. పుష్కరాలు, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులలోనూ చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విమర్శించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందని పేర్కొన్న ఆయన ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. తనకున్న పరిచయాలు పెద్దవని అహంకారంతో చంద్రబాబు, అన్ని రంగాలలోనూ బోలెడన్ని స్కాములు చేశాడని, ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు అడ్డంగా దొరికాడని గుర్తుచేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చంద్రబాబు ఎవరికీ మంచి చేయలేదని అందుకే ఆయనకు ఎవరు అండగా నిలబడడం లేదని పేర్కొన్నారు.
ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు జైలుకు వెళతారు.. నాకేంటి లే అని చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని, చంద్రబాబు చేసింది అడుగడుగునా పాపమేనని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏపీ సిఐడి అధికారులు చంద్రబాబుని అరెస్టు చేయడం మంచి పనో కాదో వచ్చే ఎన్నికలలో తెలుస్తుందని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ప్రజల్లో ఎవరికీ సానుభూతి లేదని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications