హత్య కేసు: అజ్ఞాతంలో బైరెడ్డి, సంబంధం లేదని భార్య

సాయి ఈశ్వరుడు కేసుపై బైరెడ్డి సతీమణి భారతి స్పందించారు. సాయి ఈశ్వరుడు హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసమే తమ పైన కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయి ఈశ్వరుడు కుటుంబంతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.
కాగా, రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై ఆదివారం హత్య కేసు నమోదయిన విషయం తెలిసిందే. కర్నూలు నగరంలో శనివారం జరిగిన నందికొట్కూర్ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సాయి ఈశ్వర్ హత్యకు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆయన తండ్రి శేష శయనారెడ్డి, తమ్ముని కుమారుడు సిద్ధార్థ రెడ్డితో పాటు ముచ్చుమర్రి గ్రామానికి చెందిన కె బాషాలు కారణమని హతుడి కుటుంబ సభ్యులు మూడవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హత్యా స్థలంలో నిందితుల్లో ఒకడిగా భావిస్తున్న కె బాషా సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య సంఘటనలో పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన వారు కూడా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. దీంతో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications