ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందుతుందా?
AP govt employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన వేళ.. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. త్వరలో బకాయిలన్నింటినీ విడుదల చేయడానికి అవసరమైన చర్యలను తీసుకుంది. ఇందులో భాగంగా- ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులను మరోసారి చర్చకు ఆహ్వానించింది.
తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు కొంతకాలంగా ఉద్యమిస్తూనే వస్తోన్నారు. సామరస్యపూరకంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలేవీ కొలిక్కి రావట్లేదు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని కోరుకుంటోన్నారు.

ఈ నెల 27వ తేదీన ఛలో విజయవాడ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఇదివరకే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా నేడు ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు.
ఛలో విజయవాడ ఆందోళన గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- ప్రభుత్వం తక్షణ నివారణ చర్యలకు దిగింది. మరోసారి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో ప్రభుత్వం సమావేశమైంది. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం.. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు చర్చలకు ఆహ్వానించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి.. పాల్గొన్నారు. జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు సహా 13 ఉద్యోగుల సంఘాల నాయకులు దీనికి హాజరయ్యారు. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించడం, ఛలో విజయవాడ ఆందోళన నుంచి వారిని విరమింపజేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిష్కరించడానికి 5,500 కోట్ల రూపాయలు అవసరమౌతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మొత్తాన్ని విడుదల చేయాలని మంత్రి వర్గ ఉపసంఘం ఆదేశించినట్లు బొత్స చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల అన్ని డిమాండ్లను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బొత్స అన్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి రాకముందే- దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే హామీ అటకెక్కుతుందనే ఆందోళన వారిలో నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications