భూముల విలువ తగ్గించారు - ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు..!!
అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. కేంద్రం సైతం అమరావతికి తోడ్పాటు అందిస్తోంది. ప్రపంచ బ్యాంకు రుణం రాజధాని నిర్మాణం కోసం మంజూరు కావటంతో.. ఆర్దిక ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండో విడత భూ సమీకరణ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఉండవల్లికి చెందిన కొందరు రైతులు భూముల విలువ పైన ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసిన అంశం వెలుగులోకి వచ్చింది.
రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ సమయంలో నే రాజధాని అమరావతి పరిధిలో భూముల విలువ నిర్ధారణపై ప్రపంచ బ్యాంకుకు ఉండవల్లి రైతులు ఫిర్యాదు చేశారు. భూముల విలువకు సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చే సమయంలో తక్కువ చేసి చూపుతున్నారని, అప్పులు పొందే సమయంలో రూ.కోట్లలో చూపిస్తున్నారని అందులో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన వరల్డ్ బ్యాంకు అధికారి ఒలీవర్ జూన్ మొదటి వారంలో సిఆర్డిఎకు లేఖ పంపారు. ఉండవల్లి గ్రామంలో భూముల విలువ నిర్ధారణ, రక్షణ నిబంధనల ఉల్లంఘనలపై కొత్త ఫిర్యాదు వచ్చిందని, దీనిపై పరిశీలించాలని అందులో పేర్కొన్నారు. తమకు అందిన ఫిర్యాదులో భూముల విలువ నిర్ధారణలో తీవ్ర వ్యత్యాసం ఉందని, ప్రాజెక్టు డాక్యుమెంటులో సెక్షన్-4, (రక్షణ వ్యవస్థలు), ఆసియా అభివృద్ధి బ్యాంక్ 'ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంట్' లోని పేరా 35లో నిర్దేశించిన 'పునరుద్ధరణ వ్యయం' సూత్రాలను ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తోందని రైతులు పేర్కొన్నట్లు తెలిపారు.

పరిశీలించాలని సీఆర్డీఏకు లేఖ
కాగా, ఎపిసిఆర్డిఎ 210 మిలియన్ డాలర్ల స్ట్రాటజిక్ ల్యాండ్ మానిటైజేషన్ లక్ష్యాన్ని సాధించడం కోసం బ్యాంకుల వద్ద భూములకు అధిక వాణిజ్య, రియల్ ఎస్టేట్ విలువలు ఉన్నట్లు చూపిస్తున్నారని, క్షేత్రస్థాయిలో మాత్రం, స్థానిక రైతులతో వివాదాలను పరిష్కరించడానికి ఎకరాకు కేవలం రూ.25 లక్షల చొప్పున నిర్ధారిస్తున్నారని పేర్కొన్నట్లు వివరించారు. గజం రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఉందని ప్రపంచ బ్యాంకుకు ఐసిఎఐ నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. అంటే ఎకరం రూ.25 కోట్లు ధర వస్తుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో 2014 రాష్ట్ర విభజనకు ముందే ఉండవల్లిలో సారవంతమైన భూముల విలువ ఎకరాకు కనీసం రూ.2.5 కోట్లుగా ఉందని, ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధరలు ఎకరాకు రూ.10 కోట్ల నుండి రూ.30 కోట్ల వరకు పలుకుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. దీనిపై భూముల వివరాలు నివేదిక ఇవ్వాలని సిఆర్డిఎ ఉన్నతాధికారులు ఉండవల్లి యూనిట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టరును వివరణ కోరినట్లు తెలిసింది. దీనిపై ఉండవల్లి ఎస్టిసి సిఆర్డిఎకు భూముల విలువపై నివేదిక పంపించినట్లు సమాచారం.













Click it and Unblock the Notifications