కాల్ మనీ: కేశినేని నాని టిడిపి నేతల కొంప ముంచారా?
హైదరాబాద్: సెక్స్ రాకెట్‌తో మిళితమైన కాల్ మనీ కుంభకోణం అధికార తెలుగుదేశం పార్టీని కుదిపేస్తోంది. ఈ కుంభకోణం నిందితులతో తెలుగుదేశం పార్టీ నేతల సంబంధాలు వెలుగు చూడడంతో టిడిపి చిక్కుల్లో పడింది. అయితే, ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని చూపిన చొరవనే కారణమనే ప్రచారం సాగుతోంది.
విజయవాడ పార్టీలో తన ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి ఆయన ఈ వ్యవహారాన్ని వాడుకున్నట్లు చెబుతున్నారు. అందులో నిజం ఉన్నా, లేకపోయినా కేశినేని నాని చూపిన చొరవ కాల్ మనీ డొంక కదలడానికి కారణమైందని మాత్రం తెలుస్తోంది.
అపారెల్ డిజైనర్ ఆధ్వర్యంలో కాల్ మనీ బాధితులు కొంత మంది కేశినేని నానిని కలిసి తమ సమస్యలను చూడాలని పోలీసులకు చెప్పాల్సిందిగా కోరారని సమాచారం. దీంతో పటమటలోని వడ్డీవ్యాపారుల ఆట కట్టించాలని కేశినేని నాని విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్‌కు సూచించారని అంటున్నారు. దీని వెనుక ఉన్న వారి బాగోతాలు బయటకు తీయడానికి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి కూడా తీసుకున్నారని చెబుతున్నారు.

కాల్ మనీ బాధితులకు అండగా నిలిచారనే కీర్తిని పొందడానికే కాకుండా పార్టీలోని ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి నానికి ఇది పనికి వచ్చిందని అంటున్నారు. ఈ కాల్ మనీపై పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించిన వెంటనే టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేరు బయటకు వచ్చింది. కాల్ మనీ నిందితుడు వెనిగెళ్ల శ్రీకాంత్‌తో ఉన్న సంబంధాలు బోడె ప్రసాద్ ప్రతిష్ట చాలా వరకు దెబ్బ తిన్నదని అంటున్నారు. ఆ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పడానికి మీడియా ముందుకు వచ్చిన బోడె ప్రసాద్ పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది.
నాని విజయవాడ తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్‌ను కూడా లక్ష్యం చేసుకున్నట్లు చెబుతున్నారు. గద్దె రామ్మోహన్ అనుచరుల్లో కొంత మందికి కాల్ మనీ వ్యవహారంతో సంబంధాలున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా వెలుగులోకి వచ్చింది. బుద్దా వెంకన్న సోదరుడు నాగేశ్వర రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బుద్ధా వెంకన్న ప్రతిష్ట కూడా ఏదో మేరకు దెబ్బ తిన్నట్లేనని భావిస్తున్నారు.
భారీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు, కేశినేని నానికి అసలు పడడం లేదు. 2014 ఎన్నికల సమయం నుంచి వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కాల్ మనీ నిందితుల్లో ఒక్కడైన రాము, అతని భాగస్వామి 2014 ఎన్నికల్లో గెలిచిన టిడిపి అభ్యర్థులకు సన్మానం చేశారు.
వెనిగళ్ల శ్రీకాంత్‌తో జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు కూడా సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ ఆరోపణలను బాపిరాజు ఖండించారు. మొత్తం మీద, తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలే కాల్ మనీ వ్యవహారం వెలుగు చూడడానికి కారణమనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications