ఎన్టీఆర్ కోర్టులో బంతి, చిరు సానుభూతి: పవన్ ఈజ్ రైట్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి తన ప్రచారం బంతి హీరో జూనియర్ ఎన్టీఆర్ కోర్టులోనే ఉంది! పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సహా అందరూ పార్టీకి జూనియర్ ప్రచారం పైన స్పందిస్తూ.. ఆయన ఇష్టం అని చెబుతున్నారు. పార్టీకి ప్రచారం చేయాలని తాము ఎవరిని బొట్టు పెట్టి పిలవలేదని, ఆ అవసరం లేదని, పార్టీ పైన అభిమానం ఉంటే వారే వచ్చి ప్రచారం చేయాలని కుండబద్దలు కొడుతున్నారు.
హీరో నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌లు పలుసార్లు జూనియర్ ప్రచారం పైన స్పందించారు. ఎవరిని తాము పిలువలేదని చెప్పారు. చంద్రబాబు కూడా అదే విధంగా స్పందించారు. బాలకృష్ణ ఒకింత ఘాటుగానే స్పందించారు. జూనియర్‌కు పార్టీ అవసరం లేదేమో అన్నారు. అతను రావాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పార్టీ పైన అభిమానం ఉంటే ఆయనే రావాలని చెప్పడం ద్వారా ప్రచారం బంతిని జూనియర్ కోర్టులోకే నెట్టారు.

అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి స్టార్ కంపెయినర్లు ఉండటం కూడా చంద్రబాబుకు ధీమాను కలిగిస్తోంది. బిజెపి హవా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తోడు కావడం టిడిపిలో ఉత్సాహం కనిపిస్తోంది. బాలకృష్ణ, నారా లోకేష్, తారక రత్న జోరుగా ప్రచారం చేస్తున్నారు. వారు ఎడతెరిపి లేకుండా ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
జూనియర్‌కు చిరు సానుభూతి!
కేంద్ర పర్యాటక శాఖమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి శుక్రవారం ఓ రకంగా జూనియర్ ఎన్టీఆర్ పైన సానుభూతి వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడుతూ... జూనియర్ ఎన్టీఆర్‌లా తన సోదరుడు పవన్ కళ్యాణ్‌ను టిడిపి పక్కన పెట్టలేదన్నారు. జూనియర్‌కు తన సోదరుడికి చాలా తేడా ఉందన్నారు. తన సోదరుడు ఓ పార్టీకి అధ్యక్షుడని, ఆయనకు ఓ విజన్ ఉందని చెప్పారు. ఆయనను పక్కన పెట్టడం చంద్రబాబు వల్ల కాదని చిరు పరోక్షంగా చెప్పారు.
ప్రేమ కురిపించికుంటున్న చిరు, పవన్
చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతిస్తున్నప్పటికీ ఇరువురు మాత్రం ఒకరి పైన మరొకరు తమ ప్రేమను చాటుకుంటున్నారు.
పవన్ పార్టీ స్థాపించినప్పుడు, ఇతర సందర్భాలలో చిరు గురించి మాట్లాడుతూ... కాంగ్రెసు చేసిన తప్పుకు తన అన్నయ్యను ఎందుకు అనాలని వ్యాఖ్యానించారు. అలాగే చిరంజీవి కూడా పలు సందర్భాలలో పవన్ వెళ్తున్న దారిని ఎప్పుడు తప్పు పట్టలేదు. పవన్ వెళ్తున్న దారి వేరు అయినప్పటికీ.. తమ ఇద్దరి గమ్యం మాత్రం ఒక్కటేనని చెప్పారు. తమ కుటుంబం ప్రజల గురించి ఆలోచిస్తుందని, ప్రజలకు ఏదో చేయాలనే తపన ఉంటుందని చిరంజీవి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications