సస్పెన్స్‌కు తెర!: గుంటూరులో రాజధాని, తీరం వెంట..
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా ఉత్కంఠకు తెర దించుతున్నారు. విజయవాడ సమీపంలో రాజధాని అంటూ అసెంబ్లీలో అస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు.. బుధవారం వినుకొండ నియోజకవర్గం శావల్యాపురంలో జరిగిన జన్మభూమి - మా ఊరు గ్రామసభలో మరికొంత స్పష్టత ఇచ్చారు. గుంటూరు జిల్లాలోనే రాజధాని ఉంటుందని, కృష్ణాతీరం వెంబడే అది ఉంటుందని చెప్పారు.
ఈ ప్రజా రాజధానిలో సీమాంధ్రులంతా భాగస్వాములు కావాలని, ఇక్కడ నివసించే ప్రజలంతా కనీసం ఒక ఇటుక, నగదు లేదా శ్రమదానం చేసి పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. నవ్యాంధ్రలోని 4.93 కోట్ల ప్రజలంతా తమవంతు సహకారం అందిస్తే ప్రపంచంలోని అత్యద్భుతమైన రాజధాని నిర్మించడం అసాధ్యమేమీ కాదన్నారు. నూతన రాజధాని నుంచి కేవలం మూడు గంటల్లో హైదరాబాద్ చేరుకునేలా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు.

కాగా, ప్రకాశం బ్యారేజీ బ్యాక్ వాటర్ నుండి గుంటూరు వైపు రాజధాని ఉంటుంది. గుంటూరు జిల్లా పరిధిలో 20 నుండి 25 కిలోమీటర్ల పొడవు, 8-10 కిలోమీటర్ల వెడల్పున ఏపీ రాజధాని నిర్మాణం జరగనుందని తెలుస్తోంది. ఇది పూర్తిగా గుంటూరు జిల్లా పరిధిలో ఉంటుంది. దీనికోసం 50వేల ఎకరాల భూమిని సమీకరించాల్సి వస్తుందని అంచనా. రాజధాని భూసమీకరణకు ప్రకాశం బ్యారేజీ బ్యాక్ వాటర్ నుండి గుంటూరు జిల్లా వైహు ఒక హద్దుగా భావిస్తున్నారు.
రెండో హద్దుగా ఆటో మంగళగిరి ఆటో నగర్ వెనుక వైపుకు రావొచ్చని వార్తలు వస్తున్నాయి. దొండపాడు సమీపంలో మూడో సరిహద్దుగా ఉండనుంది. రైతులు సహకరించే దానిని బట్టి భూమిని సేకరించే తీరు ఉంటుంది. రైతులు సహకరించడం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయానికి రానుంది. రైతులకు ఎక్కడి వారికి ఆ జోన్‌లోనే భూమి ఉంటుంది. వాస్తుపరంగా కూడా అన్ని అనుకూలతలు చూసి రాజధాని ప్రాంతంపై చిన్న చిన్న మార్పులు చేసే అవకాశాలున్నాయని సమాచారం.












Click it and Unblock the Notifications