సూర్యగ్రహణం ఒక్కటే కాదు.. ఆ రోజు విశ్వంలో ఒకేసారి నాలుగు అరుదైన అద్భుతాలు
ఖగోళ ప్రేమికులు, అంతరిక్ష పరిశోధకులకు ఆగస్టు 12.. ఓ ప్రత్యేకమైన రోజుగా నిలవబోతోంది. ఆ రోజు విశ్వంలో ఒకేసారి నాలుగు అరుదైన అద్భుతాలు చోటు చేసుకోన్నాయి. సంపూర్ణ సూర్యగ్రహణం ఒక్కటే ఓ అద్భుతం అనుకుంటే.. దాని వెనక మరో నాలుగు ఘటనలు సంభవించబోతోన్నాయి.. ఒక్క రాత్రిలో. ఈ అరుదైన ఖగోళ వింతల కలయిక కోసం అంతరిక్ష పరిశోధకులు, వీక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు.
12వ తేదీ ఒకే రోజు సంపూర్ణ సూర్యగ్రహణం, గ్రహాల అమరిక, అమావాస్య, పెర్సీడ్ ఉల్కాపాతం ఒకేసారి చోటుచేసుకోనున్నాయి. ఈ వింతలలో మొదటిది సంపూర్ణ సూర్యగహణం. ఇది భారత్ లో కనిపించదు. రష్యా ఉత్తర ప్రాంతాలు, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్ లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా, యూరప్, ఆఫ్రికాలోని పలు ప్రాంతాల ప్రజలు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడవచ్చు ఆ రోజున.

సంపూర్ణ సూర్యగ్రహణం.. లియోన్- స్పెయిన్, రేక్‌జావిక్- ఐస్‌ల్యాండ్, వలెన్సియా- స్పెయిన్, జరాగోజా- స్పెయిన్ లో సంపూర్ణంగా కనిపిస్తుంది. యాంకరేజ్- అలాస్కా, బోస్టన్- మసాచుసెట్స్, డెట్రాయిట్- మిచిగాన్, ఫెయిర్‌బ్యాంక్స్- అలాస్కా, జూనో- అలాస్కా, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీతో పాటు అల్జీరియా, బెర్లిన్, మొరాకో, ఐర్లాండ్, కెనడా, పోలాండ్, పోర్చుగల్, బ్రిటన్, ఇటలీ, గ్రీన్‌ల్యాండ్, ఫ్రాన్స్, రష్యా, స్వీడన్, ట్యునీషియా, ఆస్ట్రియా దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనువిందు చేయనుంది.
సూర్యగ్రహణానికి ముందే ఆకాశంలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోని బుధుడు, గురుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే సరళరేఖ పైకి రానున్నాయి. ఈ గ్రహాల కలయికను ప్లానెటరీ అలైన్‌మెంట్ అని పిలుస్తారు. తెల్లవారుజామున సంభవించే ఈ అరుదైన ఘట్టంలో అంగారకుడు, బుధుడు, గురుడు, శని గ్రహాలను సాధారణ కంటితోనే చూడవచ్చు. సుదూరాన ఉన్న యురేనస్, నెప్ట్యూన్ లను వీక్షించడానికి మాత్రం శక్తివంతమైన టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ అవసరమౌతాయి.
అదే రోజు రాత్రి వేళ అంతరిక్షంలో అమావాస్య ఏర్పడబోతోంది. చంద్రుడి వెలుతురు లేకపోవడం వల్ల ఆకాశం పూర్తి కటిక చీకటిమయంగా మారుతుంది. ఈ చీకటి వాతావరణంలో పెర్సీడ్ ఉల్కాపాతాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు. సాధారణంగా ప్రతి సంవత్సరం భూమి తన కక్ష్యలో ప్రయాణిస్తూ స్విఫ్ట్ టటిల్' అనే తోకచుక్క వదిలిన అంతరిక్ష శిథిలాల గుండా వెళుతుంది. ఆ సమయంలో వేగంగా భూ వాతావరణంలోకి దూసుకొచ్చే శకలాలు మండిపోయి, ప్రకాశవంతమైన కాంతి రేఖలుగా కనువిందు చేస్తాయి.
అమావాస్య చీకటి వల్ల పెర్సీడ్ ఉల్కాపాతాన్ని వీక్షించే వారికి తిరుగులేని అనుభూతి లభించినట్టే. ఆకాశం నిర్మలంగా ఉంటే గంటకు దాదాపు 100 ఉల్కలను కనులారా వీక్షించే అరుదైన అవకాశం లభిస్తుంది.. స్కైగేజర్లకు. 12వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఈశాన్య దిశలో ఉండే పర్సియస్ నక్షత్ర మండలంలో ఈ ఉల్కాపాతాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఈ నాలుగు అద్భుతాలు ఒకే చోటు నుంచి వీక్షించడం సాధ్యం కాకపోయినప్పటికీ.. ఇవన్నీ ఒకే రోజున సంభవించడం అరుదు.





Click it and Unblock the Notifications