గుట్టలో కారు బోల్తా: ముగ్గురి మృతి, పగోలో పెట్రోలు పోసి కాల్చేశారు

రంగారెడ్డి జిల్లా బోడుప్పల్, ఘట్‌కేసర్ మండలం తేనుగూడెం నుంచి కొందరు శనివారం రాత్రి టాటా ఏస్ వాహనంలో లక్ష్మీనరసింహుడి దర్శనం కోసం బయల్దేరారు. ఘాట్ రోడ్‌లో హోటల్ పున్నమి సమీపంలో గల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి వాహనం పల్టీకొట్టి లోయలో పడిపోయింది.
దీంతో నర్సమ్మ, ఆంజనేయులు, కృష్ణగా భావిస్తున్న బోడుప్పల్ వాసులు అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ కాకి రాములు, పావని, విఘ్నేష్, స్వప్న మాధురి, కల్పన, తులసి, భరత్, లత, సౌమ్య, లక్ష్మి, వేణుగోపాల్ తల, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.
గాయపడిన వారిని లోయలో నుంచి బయటకు తీసిన పోలీసులు ప్రాథమిక చికిత్స చేయించి హైదరాబాద్‌కు తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
తూగోలో ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 12 మంది ఒకే వాహనంలో శుక్రవారం విశాఖపట్నంలోని పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రాజమండ్రి సమీపంలోని దివాన్‌చెరువు వద్ద ఆగి ఉన్న లారీని వీరి వాహనం ఢీకొట్టింది.
శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో టి నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన బచ్చు ఆంజనేయులు (39) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జీలుగుమిల్లి మండల కామయ్యపాలెం వాసి సీమకుర్తి మల్లిఖార్జునరావు (45) చికిత్స పొందుతూ రాజమండ్రి ఆస్పత్రిలో మృతి చెందాడు.
పెట్రోలు పోసి కాల్చిన దుండగులు
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కొవ్వాడ అన్నవరంలో రాత్రి పడుకున్న వారి పైన గుర్తు తెలియని దుండగులు పెట్రోలు పోసి కాల్చి చంపారు. ప్రకాశ్, రాజమణి, పృథ్వీరాజ్, వంశీలు మృతి చెందారు.












Click it and Unblock the Notifications