ఆనాటి నుండి ఈనాటి వరకు తిరుమలలో ఏదో ఒక ప్రమాదం..
Tirumala road accident: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో వరుసగా దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటూనే వస్తోన్నాయి. ప్రత్యేకించి- అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందనే వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంతరం ఇలాంటి ఘటనలు నమోదవుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ నెల 8వ తేదీన వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లను జారీ చేయడానికి తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లల్లో తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. మరో 41 మంది గాయపడ్డారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తోన్నారు.

ఈ షాక్ నుంచి తేరుకోకముందే తిరుమలలో లడ్డు కౌంటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అదే సమయంలో తిరుమల పరాకామణిలో ఘటన నమోదైంది. ఆ వెంటనే తిరుమల ఘాట్ రోడ్డులో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తాజాగా ఎగ్ బిర్యాని సంఘటన ఉలిక్కిపడేలా చేసింది.
కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలలో కొందరు భక్తులు ఎగ్ బిర్యానీ తింటూ కనిపించడం అక్కడి భద్రత వైఫల్యానికి అద్దం పట్టినట్టయింది. ఇలాంటి వరుస సంఘటనలు అతి కొద్ది రోజుల వ్యవధిలోనే నమోదవుతోండటం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.
తాజాగా- తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం సంభవించింది. ఏడో మైలు వద్ద ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు గాయపడ్డారు. మలుపులో కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. బోల్తా పడింది. కారులో ఉన్న వాళ్లు గాయపడ్డారు.
దీన్ని గుర్తించిన తోటి వాహనదారులు వెంటనే టీటీడీ సిబ్బందికి, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, టీటీడీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.












Click it and Unblock the Notifications