జగన్‌పై కేసు నమోదు
మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా.. పట్టించుకోకుండా గుంటూరు మిర్చియార్డులో వైసీపీ నాయకులు కార్యక్రమం నిర్వహించడం ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన వైఎస్ జగన్ తోపాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి తదితరులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, జగన్ పర్యటన కారణంగా మిర్చియార్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

కాగా, వైఎస్ జగన్ బుధవారం గుంటూరు మిర్చి యార్డులో రైతులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతుల వద్దకు వెళ్తున్న సమయంలో పోలీసుల సెక్యూరిటీ లేకపోవడంతో జనసందోహం మధ్యే ఆయన రైతులను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్లకాలం కూటమి ప్రభుత్వం ఉండదన్నారు.
విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబూ? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వారా? అని ప్రశ్నించారు. మీరు చేస్తున్నది కరక్టేనా? అని ప్రశ్నించారు. విపక్ష నేత రైతులతో మాట్లాడేందుకు వస్తే పోలీసు భద్రత కూడా ఇవ్వరా? అని జగన్ నిలదీశారు.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారన్నారు జగన్. రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందన్నారు. కూటమి పాలనలో రైతులు బతికి పరిస్థితి లేదని విమర్శించారు. మరోవైపు, గుంటూరు మిర్చి యార్డులో జగన్ వ్యవహరించిన తీరుపై మంత్రులు, టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications