ఓటుకు నోటు: చంద్రబాబుపై చర్యలకు ఎసిబి వద్ద అప్షన్లు ఇవే
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై చర్యలకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వద్ద మూడు ఆప్షన్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఓటుకు నోటు కేసులో రాజీ పడినట్లు వచ్చిన వార్తలను తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు ఖండిస్తున్నారు. చంద్రబాబును వదిలే ప్రసక్తి లేదని కూడా చెబుతున్నారు.
చంద్రబాబుపై చర్యలకు ఎసిబి ఏ విధంగా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఎసిబి వద్ద మూడు ఆప్షన్లు ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో టేప్‌పై ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత చంద్రబాబుకు ఎసిబి నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. ఇది ఈ నెల 28వ తేదీ తర్వాత జరగవచ్చునని తెలుస్తోంది.

వాంగ్మూలం ఇచ్చేందుకు ఎసిబి ముందు హాజరు కావాలని సిఆర్‌పిసి 160 లేదా సిఆర్‌పిసి 161 కింద నోటీసు జారీ చేయవచ్చు. ఆడియో టేప్‌ల సంభాషణల నిర్ధారణను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఆ గొంతు చంద్రబాబుదా కాదా, టేపులను కట్ అండ్ పేస్ట్ పద్ధతిలో రూపొందించారా అనేదానిపై ఈ నోటీసు జారీ చేయడం ఆధారపడి ఉంటుంది.
చంద్రబాబు వాయిస్ టెస్టు నమూనాను సేకరించేందుకు అనుమతి కోరుతూ ఎసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఇది ఎసిబి కోర్టుకు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక అందిన తర్వాత జరుగుతుంది. మూడో ఆప్షన్ ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబును నిందితుడిగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేయవచ్చు.
నిందితుడిగా చేరుస్తూ మెమో దాఖలు చేయడానికి ముందు చంద్రబాబుకు ప్రశ్నావళిని పంపించాల్సి ఉంటుంది. కేసు గురించి చంద్రబాబుకు తెలిసిన విషయాలను అడుగుతూ ఆ ప్రశ్నావళి ఉంటుంది. ఇదిలావుంటే, ఈ నెల 24వ తేదీన రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఈ స్థితిలో కౌంటర్ దాఖలు చేయడానికి ఎసిబి సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications