గవర్నర్ పిలిచినా వెళ్లని చంద్రబాబు: సలహాదారులతో భేటీపై వివాదం
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడేందుకు గవర్న ర్ నరసింహన్ ఆహ్వానించినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్లలేదని తెలుస్తోంది. నోటుకు ఓటు కేసు నేపథ్యంలో చంద్రబాబుతో సహా ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం నాయకులు గవర్నర్‌నే లక్ష్యంగా చేసుకున్నారు. గవర్నర్ తమ పట్ల సరిగా వ్యవహరించడం లేదని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో భేటీకి చంద్రబాబు ఇష్టపడలేదని తెలుస్తోంది.
గవర్నర్ వద్దకు వెళ్లకుండా ఆయన సలహాదారులను ఇంటికి చంద్రబాబు పిలిపించుకున్నారు. ఒక గవర్నర్‌కు సలహాదారులుగా ఉన్నవారిని ఒక ముఖ్యమంత్రి పిలిపించుకోవడం ఏమిటనే విషయంపై వివాదం చెలరేగుతోంది. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఆంధ్రప్రజలకు ఎవరికి కూడా ముప్పు ఏర్పడకుండా చూసే బాధ్యతానిర్వహణలో గవర్నర్‌కు తోడ్పాటు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సలహాదారులను నియమించింది. సెక్షన్ 8లో భాగంగా వారిని కేంద్రం నియమించింది.

గవర్నర్ సలహాదారులుగా ప్రస్తుతం మాజీ ఐపీఎస్ మహంతి, మాజీ ఐఏఎస్ శర్మ ఉన్నారు. అయితే వీరు కేవలం గవర్నర్‌కు మాత్రమే సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గవర్నర్ సూచనల మేరకు ఇరు రాష్ర్టాల ప్రభుత్వాధికారులకు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రొటోకాల్‌ను పక్కనపెట్టిన చంద్రబాబు ఆ ఇద్దరు సలహాదారులను తన ఇంటికి పిలిపించుకోవడం వివాదంగా మారింది.
పైగా సెక్షన్ 8 అమలుకు గవర్నర్‌పై ఒత్తిడి తేవాలని, ఆ మేరకు ఆయనకు సూచనలివ్వాలని చెప్పడమేకాకుండా తాను చెప్పే అంశాలను గవర్నర్‌కు చెప్పి అమలు చేయించాలని చంద్రబాబు వారికి చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు తమతో చెప్పిన విషయాలను వారు గవర్నర్‌కు చెప్పారు.
చంద్రబాబు రోజుకు నాలుగైదుసార్లు ఏపీ డీజీపీ, ఏసీబీ డీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌తో చంద్రబాబు సమావేశమవుతూ నోటుకు ఓటు కేసు పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లలో నోటీసులు ఇప్పించేందుకు ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ ఏసీబీ నుంచి నాకు నోటీసులు వస్తే ప్రతిగా మనం కూడా నోటీసులు ఇవ్వాలని స్పష్టంచేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications