వివేకా హత్య కేసు - నిందితుడుగా ఛార్జ్ షీట్ లో మరో పేరు : ఎంపీకి సన్నిహితుడుగా..!!
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ మరో ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. అందులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది. 2019 మార్చి 15న వివేకా హత్యకు గురయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా సీబీఐ అనేక కోణాల్లో పలు ఆధారాలు సేకరించింది. అందులో భాగంగా.. వివేకా అత్యంత సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డి, ఇంటి వాచ్‌మెన్ రంగన్న, మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి, యాదాటి సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, చిన్నాన్న వైఎస్ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ అభిషేక్‌రెడ్డి సహా పలువురిని విచారించింది.
అయితే, అనూహ్యంగా దస్తగిరి ఈ కేసులో అప్రూవర్ గా మారటంతో ఈ కేసు మరో ట్విస్టు తీసుకుంది. కాగా, నవంబరు 17న హైదరాబాద్‌లో శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారు లు అదుపులోకి తీసుకున్నారు. 18న పులివెందుల కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించారు. నాటి నుంచి రిమాండ్ ఖైదీగా కడప సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. సీబీఐ ఈ కేసుకు సంబంధించి సమగ్రంగా తుది చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంది. అయితే, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓటమి చవిచూశారు.

Recommended Video
ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి మద్దతివ్వని కారణంగానే ఓడిపోయానని వివేకా తనతో చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు. శంకర్ రెడ్డి తనను హెచ్చరించిన విషయాన్ని దస్తగిరి తన వాంగ్మూలంలో సీబీఐకి వివరించారు. దీని ఆధారంగా సీబీఐ శంకర్ రెడ్డి హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే, ఈ హత్య కేసుతో తన తండ్రికి సంబంధం లేదని.. శంకర్ రెడ్డి కుమారుడు సీబీఐకి లేఖ రాసారు. ఇప్పుడు సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో శంకర్ రెడ్డి పేరు చేర్చటంతో ఇప్పుడు ఈ విచారణలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications