రాజ్యసభ: విజయసాయికి, జగన్‌కు కోర్టు షాక్, దెబ్బకు పరుగు పెట్టారు!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలోకి అడుగు పెట్టేందుకు ఉవ్వీళ్లూరుతున్న ఆ పార్టీ నేత విజయ సాయి రెడ్డికి సీబీఐ న్యాయస్థానం శుక్రవారం నాడు గట్టి ఝలక్ ఇచ్చింది. విజయ సాయికి సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జగన్‌కు వారెంట్ జారీ చేసింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో విజయ సాయి ఏ 2 నిందితుడు. కేసుల పైన విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఈ శుక్రవారం విజయ సాయి, జగన్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో జగన్‌కు వారెంట్, సాయికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
అనారోగ్యం కారణంగా తాను విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు సాయి రెడ్డి పిటిషన్ సమర్పించారు. విచారణకు రాకపోవడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పిటిషన్ తిరస్కరించి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అనంతరం విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.
విజయ సాయి ఉరుకులు పరుగులు
జగన్ అక్రమాస్తుల కేసులో రెండవ నిందితుడిగా ఉన్న విజయ సాయి రెడ్డి శుక్రవారం విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఆగ్రహించింది. అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో, మధ్యాహ్న భోజన విరామం తరువాత విజయసాయి కోర్టుకు హాజరయ్యారు.
వారెంటు విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆవురావురుమంటూ కోర్టుకు వచ్చారు. అనారోగ్యం వల్లనే ఉదయం రాలేకపోయానని, వారెంటును రీకాల్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను తప్పించుకునే ఉద్దేశం తనకు లేదన్నారు. నాన్ బెయిలబుల్ వారెంటును ఉపసంహరించుకోవాలని ఆయన వేసిన పిటిషన్ పైన వాదనలు జరగనున్నాయి. వారెంట్ వెనక్కి తీసుకునే అవకాశముంది.
కాగా, విజయ సాయి రెడ్డి రాజ్యసభ ఎన్నికల కోసం ఇటీవల మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ ఉన్నాయి. నలుగురే అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవం కానున్నారు.

విజయసాయి తన అఫిడవిట్లో తన పైన ఉన్న కేసులు, ఆస్తులను ప్రస్తావించారు. అఫిడవిట్లో తన ఆస్తులతో పాటు తనపై నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. జగన్ పైన నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో భాగంగా తనపై మొత్తం 13 కేసులు నమోదయ్యాయని అఫిడవిట్లో పేర్కొన్నారు.
తనకు, తన భార్య, కుటుంబ సభ్యులకు మొత్తం రూ.17.21 కోట్ల మేర ఆస్తులున్నాయని ప్రస్తావించారు. తనతో పాటు తన భార్య కూడా వ్యక్తిగతంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, టిడిపి నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపనందున ఏపీలో కూడా అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు.












Click it and Unblock the Notifications