వివేకా కేసు దర్యాప్తుకు కొత్త సిట్-రామ్ సింగ్ అవుట్-ఏప్రిల్ 30 డెడ్ లైన్ పెట్టిన సుప్రీంకోర్టు..
ఏపీలో మూడేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు అంతకంతకూ ఆలస్యమవుతుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏఎస్పీ రామ్ సింగ్ తో పాటు ఆయన టీమ్ ను దర్యాప్తు నుంచి తప్పించింది. వారి స్ధానంలో డీఐజీ చౌరాసియా నేతృత్వంలో మరో టీమ్ ను ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
వివేకా హత్య కేసు దర్యాప్తు అంతకంతకూ ఆలస్యమవుతున్న నేపథ్యంలో నిందితులకు బెయిల్ ఇవ్వాలంటూ వారి కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మొదలుపెట్టారు. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సీబీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు..ఇంకెన్నాళ్లు దర్యాప్తు చేస్తారని ప్రశ్నించింది. అంతే కాదు కేసులో పురోగతి లేదని, అసలు కుట్రకోణం బయటపెట్టడంలో ప్రస్తుత దర్యాప్తు అధికారి రాంసింగ్ విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. దీంతో సీబీఐపై ఒత్తిడి పెరిగింది.

సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో సీబీఐ వివేకా హత్య కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఏఎస్పీ రామ్ సింగ్ ను తప్పించింది. ఆయన స్ధానంలో డీఐజీ చౌరాసియా నేతృత్వంలో కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో చౌరాసియాతో పాటు ఎస్పీ వికాస్ సింగ్, అదనపు ఎస్పీ ముఖేష్ కుమార్, ఇన్ స్పెక్టర్లు శ్రీమతి, నవీన్ పునియా, అంకిత్ యాదవ్ ఉన్నారు. వీరు ఇప్పుడు వివేకా హత్య కేసులో సీబీఐ ఇప్పటివరకూ సేకరించిన ఆధారాలతో దర్యాప్తును కొనసాగిస్తారు.

మరోవైపు సీబీఐ ప్రతిపాదించిన కొత్త సిట్ కు ఆమోదం తెలిపిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తు ఏప్రిల్ 30లోగా ముగించాలని డెడ్ లైన్ విధించింది. అటు ఈ ఆదేశాల ప్రభావం నిందితుల బెయిల్ పిటిషన్లపై ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆరునెలల్లోగా వివేకా హత్యపై అభియోగాల నమోదు, విచారణ మొదలుకాకపోతే నిందితులు సాధారణ బెయిల్ కు అప్పీలు చేసుకోవచ్చని, అయితే అప్పుడు కూడా మెరిట్ ఆధారంగానే బెయిల్ ఇస్తామని వెల్లడించింది.












Click it and Unblock the Notifications