YS Viveka case:ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ- పులివెందులలో ఉత్కంఠ..!!
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఈ ఉదయం రెండు టీంలుగా వచ్చిన సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మినహా మిగిలిన వారిని లోపలకు అనుమతించటం లేదు.
ఇప్పటికే అవినాష్ సన్నిహితుడు ఉదయ్ ను అరెస్ట్ చేసిన సీబీఐ ఇప్పుడు అవినాష్ ఇంట్లో విచారణ ప్రారంభించింది. ఉదయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో ఎంపీ అవినాష్ తో సహా పలువురు వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపివేసారని పేర్కొంది. ఇప్పుడు సీబీఐ తదుపరి చర్యలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఉదయాన్నే వచ్చిన సీబీఐ అధికారులు: వివేకా హత్య కేసులో సీబీఐ వేగంగా అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగు సార్లు విచారించింది. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఎంపీని విచారించారు. విచారణకు సంబంధించి అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేసారు.
దీనికి సంబంధించి హైకోర్టు స్పష్టత ఇచ్చింది. ఇటు వైఎస్ భాస్కర రెడ్డికి సీబీఐ రెండు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణ పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు పులివెందులలోని అవినాష్ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారుల భాస్కరరెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. టీం లో దాదాపు 15 మంది వరకు ఉన్నట్లుగా సమాచారం. అయితే, అవినాష్ రెడ్డి..వైఎస్ భాస్కర రెడ్డి కోసం సీబీఐ అధికారులు వచ్చినట్లు చెబుతున్నారు.
ఉదయ్ రిమాండ్ రిపోర్టులో కీలకంగా: ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారని సమాచారం. భాస్కర రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో వివేకా హత్యలో కొత్త అంశాలను తెర మీదకు తీసుకొచ్చారు. దీని పైన భాస్కర రెడ్డి న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సునీల్ యాదవ్ తల్లిని వివేకా వేధించిన కారణంగానే ఆ కోపంతో సునీల్ హత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇదే సమయంలో వివేకా రెండో భార్య , వారసుడి ప్రకటన అంశం కూడా తెర మీదకు వచ్చాయి.
ఇటు సీబీఐ దాఖలు చేసిన ఉదయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో మాత్రం ఎవిడెన్స్ టాంపరింగ్ లో అవినాశ్ రెడ్డి, భాస్కర రెడ్డి పేర్లను ప్రస్తావించింది. గూగుల్ టేక్ ఔట్ లొకేషన్‌లో కూడా ఉదయ్‌కుమార్‌రెడ్డి అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు తేలిందన్నారు. తన తండ్రి ప్రకాష్‌రెడ్డితో వివేకా మృతదేహానికి కుట్లు వేయించారని... అవినాష్‌రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితుడని వెల్లడించారు.
సీబీఐ అడుగుల పై ఉత్కంఠ: వివేకా మృతి చెందాడనే వార్త తెలియగానే అవినాష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి, శివశంకర్ ఘటనా స్థలానికి వెళ్లారని తెలిపారు. బాత్రూం నుండి డెడ్ బాడీని బెడ్‌రూమ్‌కి ఉదయ్ కుమార్ తీసుకువచ్చాడని.. వివేక తలకు ఉన్న గాయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది.
ప్రస్తుతం పులివెందులలో అవినాష్ నివాసంలో ఉన్న సీబీఐ అధికారులు ఇంట్లోకి ఎవరినీ అనుమతించటం లేదు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ల వ్యక్తి గత సహాకులను బయటకు పంపారు. దీంతో, వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ప్రస్తుతం సీబీఐ ఏ రకమైన నిర్ణయాలతో అడుగులు ముందుకు వేస్తుందనే ఉత్కంఠ పులివెందులలో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications