Ayesha Meera Case: ఆయేషా మీరా కేసు మళ్లీ తెరిచిన సీబీఐ ! తెరపైకి కొత్త పేర్లు..?
విజయవాడలో 15 ఏళ్ల క్రితం సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసులో సీబీఐ మరోసారి దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ కేసును రాష్ట్ర పోలీసులతో పాటు సీఐడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. అయితే గతంలో నిందితులుగా భావించిన సత్యంబాబు సహా పలువురు నిర్దోషులుగా తేలడంతో తిరిగి ఈ కేసును దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని గతంలో ఆదేశించింది. దీంతో తాజాగా ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఆయేషా మీరా కేసుపై గతంలో దర్యాప్తు చేసిన అధికారులతో పాటు దర్యాప్తు సంస్ధలు కూడా అసలు నిందితుల్ని పట్టుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో లడ్డూ అనే ఓ వ్యక్తిని కొన్నాళ్లు నిందితుడిగా చూపారు, అనంతరం సత్యంబాబును అసలు నిందితుడంటూ నానా హంగామా చేశారు. చివరికి వీరికి వ్యతిరేకంగా కోర్టుల్లో సాక్ష్యాలు సమర్పించడంలో దర్యాప్తు సంస్ధలు, అధికారులు విఫలమయ్యారు. దీంతో కోర్టులు వారిని నిర్దోషులుగా తేల్చి విడిచి పెట్టాయి.

అయితే 2018లోనే ఆయేషా మీరా కేసును సీబీఐకి అప్పగించారు. కానీ సీబీఐ మాత్రం నత్తనడకన ఈ కేసును దర్యాప్తు చేసింది. అసలైన నిందితుల్ని పట్టుకోవడంలోనూ విఫలమైంది. దీంతో సుప్రీంకోర్టు జోక్యంతో ఈ కేసు తిరిగి దర్యాప్తు చేయాల్సిన పరిస్ధితి ఎదురైంది. ఈ నేపథ్యంలో సీబీఐ తిరిగి దర్యాప్తు ప్రారంభించింది. అప్పట్లో నందిగామ డీఎస్పీగా ఉన్న శ్రీనివాస్ తో పాటు పలువురు అధికారుల్ని సీబీఐ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆయేషా మీరా హత్య జరిగి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన ఆమె తల్లితండ్రులు.. అసలు దోషుల్ని పట్టుకోవడంలో సీబీఐ విఫలమవుతోందని ఆరోపించారు. సీబీఐపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీబీఐ తాజాగా తిరిగి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణను తప్పుదోవ పట్టించారంటూ అప్పటి విజయవాడ సీపీ, ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఐపీఎస్ సీవీ ఆనంద్ తో పాటు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపైనా ఆయేషా మీరా తల్లితండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications