జగన్ కేసుల అప్ డేట్ : పెన్నా కేసులో సీబీఐ మరింత గడువు-ఇండియా సిమెంట్స్ పైనా డిశ్చార్జ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఇవాళ హైదరాబాద్ సీబీఐ కోర్టులో మరోసారి జరిగింది. పెన్నా సిమెంట్స్ తోపాటు ఇండియా సిమెంట్స్, ఇతర కేసులు కూడా ఇవాళ విచారణకు వచ్చాయి. దీంతో సీబీఐ తన వాదన వినిపించింది. జగన్ దాఖలు చేసిన కేసుల్లో కౌంటర్లు ఇచ్చేందుకు సీబీఐ సిద్ధమవుతోంది.
పెన్నా సిమెంట్స్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ పై ఇవాళ సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ మరింత గడుపు కోరింది. ఇప్పటికే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాల్సిన సీబీఐ... ఇవాళ వివరాలు సిద్ధం కాకపోవడంతో కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో మరికొంత గడువు ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది దీనికి కోర్టు అంగీకరించింది. పెన్నా సిమెంట్స్ తో పాటు రఘురాం సిమెంంట్స్ కేసులోనూ విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.

మరోవైపు ఇండియా సిమెంట్స్ కేసులోనూ ఏ1, ఏ2 నిందితులుగా ఉన్న వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తామని ఇవాళ కోర్టుకు తమ న్యాయవాదుల ద్వారా వెల్లడించారు. ఇండియా సిమెంట్స్ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ పైనా కౌంటర్ దాఖలుకు సీబీఐ గడువు కోరింది. దీంతో ఈ కేసు విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 23కు వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్లతో రావాలని సీబీఐని న్యాయస్ధానం ఆదేశించింది.
జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన జగన్, సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపైనా ఇప్పడు హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. అదే సమయంలో జగన్, సాయిరెడ్డి గతంలో సీబీఐ తమపై మోదు చేసిన కేసుల నుంచి విముక్తి కల్పించాలంటూ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. దీంతో సీబీఐ కోర్టుతో పాటు సీబీఐ వీరి విషయంలో ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications