హైస్కూల్ బాత్రూమ్‌లో సీసీ కెమెరా: కేకలు పెట్టిన విద్యార్థినులు..
బాత్రూమ్ కు పైకప్పు లేకపోవడంతో.. ఒక చెట్టుకు దాన్ని వేలాడదీసి, కొమ్మల్లో కనిపించకుండా అమర్చినట్లు తెలుస్తోంది.
నర్సీపట్నం: ఓ హైస్కూల్ పాఠశాల బాత్రూమ్ పైభాగంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసిన సంఘటన కలకలం రేపింది. విద్యార్థినులను రహస్యంగా చిత్రీకరించేందుకే ఆకతాయిలు ఈ పనికి ఒడిగట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా గోలుగొండ మండలం చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ ఉదంతం వెలుగుచూసింది.
గురువారం రోజు స్కూల్ కు వెళ్లిన విద్యార్థినులు.. బాత్రూమ్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడాన్ని గుర్తించారు. బాత్రూమ్ లకు పైకప్పు లేకపోవడంతో.. దానిపై వేలాడుతున్న ఓ చెట్టుకొమ్మకు కొంతమంది ఆకతాయిలు సీసీ కెమెరాను అమర్చారు. చిన్న కర్ర సహాయంతో సీసీ కెమెరాను కనిపించకుండా చెట్టు కొమ్మల్లో దాగేలా ఏర్పాటు చేశారు.

అయితే ఆకుల చాటు నుంచి రెడ్ సిగ్నల్ స్పష్టంగా కనిపిస్తుండటంతో.. విద్యార్థినులకు దీనిపై అనుమానం కలిగింది. వెంటనే కేకలు వేస్తూ వెళ్లి ఉపాధ్యాయులకు విషయం తెలియజేశారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేడీపేట హరికృష్ట హైస్కూల్ కు వచ్చి సీసీ కెమెరాను పరిశీలించారు. అందులో మెమొరీ కార్డు లేదని, ఎటువంటి దృశ్యాలు రికార్డు కాలేదని నిర్దారించారు.
కొయ్యూరు సీఐ ఉదయ్ కుమార్ కూడా గురువారం రాత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థినులు ఆందోళన చెందవద్దని తెలిపారు.












Click it and Unblock the Notifications