ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!!
ఏప్రిల్ 1 నుంచి జనగణన-2027 ప్రక్రియ మొదటి దశ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా హౌజ్ లిస్టింగ్ - హౌజింగ్ సెన్సస్ ను నిర్వహించనున్నారు. తొలిసారిగా ప్రజలకు స్వయంగా తమ వివరాలను సెల్ఫ్ ఎన్యుమరేషన్ పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజల సందేహాలను తీర్చేందు కు తరుచుగా అడిగే 33 ప్రశ్నల సమాధానాలను ఆ పోర్టల్‌లో పొందుపర్చారు. తెలుగు రాష్ట్రాల్లో జనగణన పై పూర్తి వివరాలను వెల్లడించారు.
ఏపీ, తెలంగాణలో రెండు విడతల్లో జనగణన జరుగుతుందని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. ఏపీలో మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జనగణనలో భాగంగా ఇళ్ల సర్వే జరుగుతుందని వెల్లడించారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు అవకాశం ఇస్తామన్నారు. ఇక, తెలంగాణలో మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల సర్వే జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10 తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు అవకాశం ఉంటుందని అన్నారు. జనాభా లెక్కల వివరాలన్నీ గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో ప్రజలు సొంతంగా జనాభా లెక్కల వెబ్‌సైట్‌లో ఇళ్ల సర్వే వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

వివరాల సేకరణ.. గోప్యంగా సమాచారం
ఇళ్ల సర్వేలో ఇంటి పరిస్థితి, ఇంటి వసతులు, వస్తువులు, ఇల్లు ఎస్సీ, ఎస్టీలకు చెందినదా వంటి 34 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ చెప్పారు. తొలివిడతలో గృహాల లెక్కింపు ఉంటుందని.. ప్రతీ ఇంటి పరిస్థితి, సౌకర్యాలు, ఆస్తులు తదితర వివరాలు సేకరిస్తామన్నారు. ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య 30 రోజులపాటు హౌస్ లిస్టింగ్ జరుగుతుందని వివరించారు. హౌస్ లిస్టింగ్‌కు నెలరోజుల ముందు సెల్ఫ్ ఎన్యుమరేషన్ కు 15 రోజులపాటు అవకాశం ఉంటుందని వెల్లడించారు. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థి తుల వివరాలతో పాటు వలసలు, సంతానోత్పత్తి స్థితిగతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు. రెండో దశలో కులగణన వివరాలు సేకరిస్తామని స్పష్టం చేసారు. అదే విధంగా https://se.census.gov.in వెబ్ పోర్టల్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. 16 భాషల్లో మొబైల్ యాప్ ద్వారానే జనాభా లెక్కల సేకరణ ఉంటుందని.. ఎన్యుమరేటర్స్ సొంత మొబైల్స్ ద్వారానే జనాభా లెక్కలను సేకరిస్తారని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications