ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ కు ఛాన్స్ - కేంద్రం హెచ్చరికలు : రాష్ట్రాలకు మార్గదర్శకాలు..!!
కరోనా తొలి దశ.. వేగంగా వ్యాపించిన రెండో దశ ప్రభావంతో భారత్ లో భారీ నష్టమే మిగిలింది. దీని నుంచి కోలుకుంటున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వణికిస్తోంది. భారత్ లోని ఓమిక్రాన్ ప్రవేశించింది. పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు అధికారికంగా గుర్తిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారి పైన ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. ఈ సమయంలోనే కేంద్రం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ రూపంలో మూడోదశ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని తేల్చి చెప్పింది. దీనికి అనుగుణంగా సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

కేంద్రం అప్రమత్తం
కోవిడ్ కొత్త వేరియంట్ గా గుర్తించిన ఓమిక్రాన్ ఇప్పుడు మూడో దశగా అనుమానిస్తూ.. జనవరి - ఫిబ్రవరి మాసాల్లో భారత్ లో ప్రభావం చూపిస్తుందని పలువురు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కొన్ని సూచనలు చేస్తూ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. రెండోదశలో డెల్టా వేరియంట్ విజృంభించినట్లే.. ఒమిక్రాన్ రూపేణా మూడోదశ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమంది. డెల్టా కంటే ఆరింతలు వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అర్హులందరికీ టీకాల పంపిణీని వేగవంతం చేయాలని సూచించింది.

రాష్ట్రాలకు కీలక సూచనలు
అందులో కీలకంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ జిల్లా కేంద్రంలో టెలీ వైద్య వ్యవస్థను మరింతగా విస్తరించాలని పేర్కొంది. జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో కొత్తగా క్రిటికల్ కేర్ సంబంధిత పడకలను ఏర్పాటుచేయాలని సూచించింది.* అన్ని మెట్రో నగరాల్లో వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు ఏర్పాటుచేయాలని సూచనల్లో భాగంగా పేర్కొంది. కొత్తగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వన్ హెల్త్‌లను ఏర్పాటుచేయాలని నిర్దేశించింది. అంతర్జాతీయ ప్రయాణ కేంద్రాల వద్ద ప్రజారోగ్య కేంద్రాలను నెలకొల్పాలని స్పష్టం చేసింది.

వైద్య సదుపాయాలు పెంచుకోవాలంటూ
కొవిడ్ నిర్ధారణ పరీక్షల, ఆసుపత్రుల పడకల ధరలకు పరిమితులు విధించాలని సూచించింది. మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ తుది సంవత్సర విద్యార్థుల సేవలను కొవిడ్ విధుల్లో ఉపయోగించుకోవాలి. కొత్త నియామకాలు జరిగే వరకు సీనియర్ రెసిడెంట్ల సేవలను వినియోగించుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచన చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన అవసరమైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించుకోవాలని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే నిపుణులైన వైద్యులకు భత్యం కోసం అవసరమైన ఆర్థిక సాయమందించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
Recommended Video

పిల్లల్లో కరోనా పైన మార్గదర్శకాలు
పిల్లల్లో కరోనాకు సంబంధించిన 'మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్'ను ఎదుర్కోవడానికి మౌలిక సదుపాయాలు కల్పించుకోవాలని స్పష్టం చేసింది. ఆక్సిజన్ ప్లాంట్ల స్థాపనకు కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆర్థికసాయం అందుతుందని హామీ ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగ తనిఖీలను నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు చేసిన సూచనల్లో పేర్కొంది. దీంతో.. వైరస్ మరింతగా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన కోవిడ్ ప్రోటోకాల్ ను పక్కగా అమలు చేయాలని ఇప్పటికే రెండు తెలుగు ప్రభుత్వాలు స్పష్టం చేసాయి. సంక్రాంతి తరువాత కేసులు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు కీలకంగా మారాయి.












Click it and Unblock the Notifications