ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ - ఎన్నికల వేళ కీలక నిర్ణయం..!!
ఏపీలో సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. పాలనా - పార్టీ పరంగా ప్రతీ అడుగు కీలకంగా మారుతోంది. ఈ సమయంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వానికి రిలీఫ్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.
ప్రాజెక్టు నిధుల విషయంలో సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరుతూ సీఎం జగన్ గతంలో ప్రధానిని కోరారు. ఇప్పుడు తాజాగా కేంద్రం నుంచి రూ 5,036 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా రాష్ట్రానికి సమాచారం ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి పోలవరం నిర్మాణంలో ఈ నిధుల కేటాయింపు కీలకంగా మారనుంది.

సీఎం వినతికి ప్రధాని సానుకూల స్పందన
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన రూ 1,948.95 కోట్లను వెంటనే రీ ఎంబర్స్ చేయాలని నిర్ణయించింది. దీంతో పాటుగా మార్చి వరకు భూ సేకరణ, నిర్వాసితుల పునరావాసం కోసం రూ2,2242.25 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ప్రాజెక్టు పనుల కోసం ముందస్తుగా రూ. 1,115 కోట్లతో కలిపి మొత్తంగా రూ 5,036 కోట్లను విడుదలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం జలశక్తి కార్యదర్శి కి సిఫార్సు చేసాయి. ఈ ప్రతిపాదనల ఆమోదం కోసం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు ప్రతిపాదించారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ నిధులకు అధికారికంగా ఆమోదం లభించనుంది.

ప్రభుత్వానికి రావాల్సినవి తొలి విడతలో
ఏపీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు కింద ఇప్పటికే రూ. 1,948 కోట్లను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు కోరింది. ఇప్పుడు ఆమోదం పొందుతున్న నిధుల్లో భాగంగా రెండు వారాల్లోగా తొలి ప్రయార్టీ కింద ఈ రీయంబర్స్ మెంట్ నిధులను విడుదల చేయనున్నారు. అదే విధంగా మార్చి వరకు చేయాల్సిన ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ 3,087.37 కోట్లను కూడా ప్రాధాన్యత ఇస్తూ విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సవరించిన అంచనాల మేరకు రూ 55,458.87 కోట్లకు ఆమెదించాలని కేంద్రాన్ని కోరుతోంది. దీనికి సంబంధించి వచ్చే ఫిబ్రవరి 1న ప్రతిపాదించే బడ్జెట్ లో కేంద్రం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనల తుది ఆమోదం కోసం ప్రధానితో మరోసారి సీఎం సమావేశం అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఎన్నికల ఏడాది కావటంతో వచ్చే బడ్జెట్ లో పోలవరంకు పూర్తిస్థాయి నిధుల కోసం ఒత్తిడి చేయాలని భావిస్తున్నారు.

ముందస్తుగా పది వేల కోట్ల విడుదల కోరుతూ..
ప్రాజెక్టుకు సంబంధించి ముందస్తు నిధుల కేటాయింపులో భాగంగా పది వేల కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్ నేరుగా ప్రధానిని కోరారు. దీనికి స్పందించిన ప్రధాని పరిశీలన కోసం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసారు.ఈ కమిటీతో ఏపీ ప్రభుత్వం అధికారుల కమిటీ పలు మార్లు సమావేశాలు నిర్వహించింది.
ముందస్తు నిధుల కేటాయింపు అవసరాన్ని వివరించింది. దీనికి కేంద్ర అధికారుల కమిటీ అంగకరించింది. నిధుల విడుదల పైన కేంద్ర ఆర్దిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని జల్ శక్తి శాఖ నిర్ణయించింది. దీంతో, రానున్న బడ్జెట్ వేళ పోలవరం ముందస్తు నిధులు...సవరించిన అంచనాల పైన కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని ఏపీ అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications