చంద్రబాబుకు కేంద్రం బిగ్ రిలీఫ్ - పోలవరంపై కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి కీలక సమాచారం అందింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నూతన డీపీఆర్ కు వచ్చే వారం కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. పోలవరం లో సవరించిన అంచనాలకు ఆమోద ముద్ర వేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. ఇదే సమయంలో డీపీఆర్ కు లభిస్తే పోలవరం కు రూ 12 వేల కోట్ల వరకు దక్కనున్నాయి. ఈ మొత్తాన్ని అడ్వాన్స్ గా తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
పోలవరం డీపీఆర్
పోలవరం ప్రాజెక్టులో కొత్త డీపీఆర్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర ప్రస్తుతం కీలకంగా మారింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లాలంటే కేంద్రం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. దీంతో సీఎం చంద్రబాబు రెండ్రోజుల దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రి పాటిల్‌లతో ఈ విషయంపైనే చర్చించారు. ప్రస్తుత డీపీఆర్ ఆమోదం పొందడంతో పాటు పోలవరంలో 45.72 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేలా అవసరమైన అన్ని పనులకూ నిధులు ఇచ్చేలా మరో డీపీఆర్‌కు ఇప్పుడే అడుగులు వేయాల్సి ఉంటుంది. సీఎం చంద్రబాబు ఈ విషయంపై కేంద్రంతో చర్చించారు.

కేంద్రం ఆమోదం కోసం
ప్రస్తుతం పోలవరం తొలిదశ పేరుతో 30 వేల 436.95 కోట్ల రూపాయలకు కొత్త డీపీఆర్ సిద్ధంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా మండలి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి ఆమోదాలు పొంది ఉంది. కేంద్ర మంత్రిమండలి ఆమోదం కోసం వేచి చూస్తోంది. వచ్చే వారం మంత్రి మండలి ముందుకు ఈ డీపీఆర్ వెళ్లనున్నట్లు సమాచారం. గతంలో 2010-11 ధరలతో రూ.16,010.45 కోట్లకు డీపీఆర్ ఆమోదం పొందింది. ఆ ప్రకారం నిధులన్నీ కేంద్రం తిరిగి చెల్లించింది. తొలిదశ పేరుతో సిద్ధంగా ఉన్న డీపీఆర్ కేంద్ర ఆమోదం పొందితే రాష్ట్రానికి రూ.12,157.53 కోట్లు అందుతాయి.
నిధుల మంజూరు
పోలవరంకు సంబంధించి మిగిలి నిధులను ఇప్పటికే రీయింబర్స్ చేసినందున ఈ మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. 2016లో నాబార్డుతో కేంద్రం ఒప్పందం చేసుకొని వారి నుంచి కేంద్రం రుణం రూపంలో పొంది రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోంది. దీంతో, ఈ రూ 12 వేల కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే ఆర్దికంగా వెసులుబాటు కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో, ఇప్పుడు కేంద్ర మంత్రిమండలి ముందుకు నూతన డీపీఆర్ వస్తుండటంతో తీసుకొనే నిర్ణయం కోసం ఏపీ ప్రభుత్వం వేచి చూస్తోంది.












Click it and Unblock the Notifications