ఎన్నికల కమిషన్ సంచలనం.. 10 మందిపై వేటు?
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్లుగా వ్యవహరించడంలేదని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాము జారీచేసిన ఆదేశాలను తుంగలో తొక్కుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. వీరిపై నివేదిక పంపించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎష్ లుకలిపి 10మంది వరకు ఉంటారని, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల గురించి సీఈసీ నివేదికలు కోరినట్లు సమాచారం.
అధికార, ప్రతిపక్ష పార్టీలతో అంటకాగుతున్న అధికారుల సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సేకరించింది. బ్యానర్లు తొలగించడం, ఫ్లెక్సీలు తీయంచడంతోపాటు కోడ్ సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. అయితే కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఎవరెవరు అలా వ్యవహరిస్తున్నారు? నిబంధనలను అమలు చేయనివారెవరు అనే కోణంలో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ అధికారి చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారిపై కమిషన్ నిఘా పెట్టింది.

రాజధాని జిల్లాల పరిధిలోని కరకట్టపై ఉన్న పోస్టర్లను, ఫ్లెక్సీలను, స్తంభాలకు కట్టివున్న రాజకీయ పార్టీల రంగులను తొలగించాలని జిల్లా కలెక్టర్ ను సీఈవో మీనా ఆదేశించారు. వీటిని ఆయన స్వయంగా గమనించారు. తర్వాతరోజు మళ్లీ అక్కడకు వచ్చే సమయానికి అవన్నీ అలాగే ఉండటంతో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని తొలగించమని చెప్పినప్పటికీ ఎందుకు తొలగించలేదంటూ కలెక్టర్ ను ప్రశ్నించారు. జాయింట్ కలెక్టర్ కు ఆ బాధ్యత అప్పగించానని జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కలెక్టర్ పై సీఈవో ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు క్లాస్ తీసుకున్నారు. వెంటనే కరెంటు స్తంభాలకు వేరే రంగులు వేయించారు.












Click it and Unblock the Notifications