అమరావతికి కేంద్రం ఊహించని వరం - కీలక మలుపు..!!
ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం వరాలు ప్రకటించింది. పెండింగ్ ప్రాజెక్టులతో పాటుగా ఆర్దిక పరమైన అంశాలకు ఆమోదం తెలిపింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందు కు కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణను త్వరలో పూర్తి చేయాలని ఆదేశిం చింది. అమరావతి-హైదరాబాద్ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర హోం శాఖ పచ్చ జెండా ఊపింది. రాష్ట్రంలో మరో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు పైనా అధ్యయనం చేసేలా నిర్ణయం తీసుకుంది.
కేంద్రం వరుస నిర్ణయాలు
అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను వేగంగా పూర్తి చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఏపీలో వెనుకబడిన జిల్లాలకు మరో రూ.350 కోట్లను గ్రాంట్ రూపంలో త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రెండు రాష్ట్రాల ప్రయాణీకులకు వరంగా మారనుంది. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రాష్ట్ర విభజన వేళ నుంచి పరిష్కారం కాని సమస్యల పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.అదే విధంగా త్వరలో అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు తెలంగాణలో ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ మొదలైంది.

అమరావతి కేంద్రంగా
కేంద్ర నిర్ణయం మేరకు ఈ డీపీఆర్ కార్యరూపం దాల్చితే.. అమరావతి - హైదరాబాద్ మధ్య నాలుగు గంటల్లోగానే గమ్య స్థానం చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ రిఫైనరీ ఇప్పటికే అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ లైన్ గురించి భూ సేకరణ ప్రక్రియ పైన కసరత్తు కొనసాగుతోంది. కేంద్రం నిధులను మంజూరు చేసింది. దీంతో, ఇక రవాణా వ్యవస్థ మరింతగా అందుబాటులోకి రానుంది. ఇదే సమయంలో.. ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటును పరిశీలించాలని పెట్రోలియం శాఖను కేంద్రం ఆదేశించింది. అదేవిధంగా విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కర్నూల్ కారిడార్ల ఏర్పాటును రైల్వేశాఖ పరిశీలించనుంది. పలు సమస్యల పరిష్కారానికి పలు శాఖలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. పెట్రోలియం రంగం లో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయనీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు.
ఏపీకి భారీ రిఫైనరీ
ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ కోసం ప్రధాని శంకుస్థాపన చేసారు. రెండేళ్ల లో అక్కడ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్దేశించారు. ఇక, విశాఖ.. కర్నూలు, హైదరాబాద్, అమరావతి కారిడార్ పైన చర్చించారు. పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచించింది. తెలంగాణ విషయంలో నీతి అయోగ్ తో చర్చలు చేయాలని స్పష్టం చేసింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను వేగంగా పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది.












Click it and Unblock the Notifications