పనులు చేయడానికి మేం డబ్బులు పంపిస్తున్నాంగా..
ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీ ఎక్కడుంటే అక్కడే రాజధాని ఉంటుందని, అమరావతిని ప్రామాణికంగా తీసుకొనే ఎయిమ్స్, ఇతర సంస్థలు వచ్చాయని, అవి రావడంవల్లే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతశాఖ మంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం నిధులు విడుదల చేసినప్పుడు అక్కడి అభివృద్ధి పనులు ఎలా నిలిపివేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి రాజధాని కాదని, ఒక జిల్లా అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.. ముందుగా అమరావతిపై ప్రకటన చేసిన తర్వాత మరో ఆలోచన ఏమిటని నిలదీశారు. తాను మాట్లాడేది కూడా అమరావతి నుంచే మాట్లాడుతున్నాకదా అన్నారు. తన పర్యటనలో రాష్ట్రం తరఫున అనేక లోపాలు బయటప పడ్డాయన్నారు.

ఎయిమ్స్ లో మంచినీటి సమస్య పరిష్కరించలేకపోయిందని, దీనివల్ల ఇన్ పేషెంట్లు నీటి సౌకర్యం లేక వైద్య చికిత్సకు దూరమయ్యారన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద అర్హులైనవారికి ఇంతవరకు కార్డులు పంపిణీ చేయలేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి బాధితులున్నారని, వారు తాగే మంచినీటిలో సిలికాన్ ప్రభావం ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులిస్తున్నా బాధితులకు స్వచ్ఛమైన మంచి నీటిని అందజేసే మార్గాలు ఎందుకు లేవని, అలాగే ఇళ్ల నిర్మాణాలు జరగకపోవడంతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తాను ఈసారి విజయవాడ పర్యటనకు వచ్చేటప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో పథకాల అమలుపై సమీక్ష నిర్వహిస్తానని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications