తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం.. కేంద్రం కీలక నిర్ణయం
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. విభజన తర్వాత అన్ని సమస్యలకు పరిష్కారం చూపిన కేంద్రం.. నీటి వివాదంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన తెలంగాణకు నీటి పంపకాల విషయంలో తేడా వస్తే వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో కేంద్రానికి బాగా తెలుసు. ఈ క్రమంలోనే జల వివాదాల పరిష్కారానికి జల్‌శక్తి శాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది
నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాషాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం ఛైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా కృష్ణా-గోదావరి బోర్డుల ఛైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉన్నారు. రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు కూడా ఇందులో స్థానం కల్పించారు. కమిటీలో ఏపీ నుంచి నలుగురిని, తెలంగాణ నుంచి నలుగురిని సభ్యులుగా చేర్చారు. ఏర్పాటైన కమిటీని నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జల్‌శక్తి శాఖ .
గత11 ఏళ్లుగా..
గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలున్నాయి . సహకార సమాఖ్య విధానంతో ఈ సమస్య పరిష్కారానికి అనేక సూచనలు చేసింది. దీనీపై అనేక సార్లు అధికారులను కృష్ణా, గోదావరి బోర్డులు సమావేశం నిర్వహించాయి. రెండు రాష్ట్రాల నుంచి వారి వారి వాదనలు విన్నాయి . అంతే కాకుండా 2025 జూలై 16న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో కీలక భేటీ కూడా నిర్వహించారు.

పొలవరం - బనకచర్ల..
ఇటీవల తీవ్ర వివాదస్పదమైన పోలవరం,బనకచర్ల ప్రాజెక్టుతో పాటు వరదల సమయంలో మిగులు జలాలపై కూడా భేటీలో చర్చ జరిగింది. టెక్నికల్ సమస్యలు పరిష్కారమైతేనే నీటి కేటాయింపులపై తుది నిర్ణయానికి వచ్చి రెండు రాష్ట్రాలకు న్యాయం చేయడానికి వీలుంటుంది. అందులో భాగంగానే 2025 జూలై 16న జరిగిన భేటీలో ముందు సాంకేతిక నిపుణులను నియమించి ఆచరణ సాధ్యమైన సూచనలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే.. ఏపీ, తెలంగాణ మధ్య ఇతర వివాదాల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేయనుంది.
డిసెంబర్ 2025లో నామినేషన్..
2025 జూలై 16న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాలు తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని కోరగా, ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేసింది. డిసెంబర్ 2025లో తన నామినేషన్లను పూర్తి చేసి అధికారుల జాబితాను కేంద్రానికి పంపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ కమిటీని అధికారికంగా నోటిఫై చేసింది.
మరో వైపు 2026 జూలై వరకు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 గడువును కూడా కేంద్రం పొడిగించింది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల మేరకు నూతనంగా ఏర్పాటైన ఈ కమిటి ఇప్పటి వరకు జరిగిన విచారణను పరశీలించి.. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 84 ప్రకారం క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అధ్యయనం చేసి జల వివాదాల పరిష్కారానికి తుది నివేదికను కేంద్రానికి అందించనుంది. ఫలితంగా వివాదాలకు తెరపడి.. రెండు రాష్ట్రాల్లో తాగునీరు, సాగు నీరు అందబోతుంది.












Click it and Unblock the Notifications