కేంద్రం ఊరట: ఏపీ రాజధానికి 1500 కోట్లు, 24x7 లిస్ట్‌లో తెలంగాణ
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఏపీ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన చట్టంలోని 94(3) ప్రకారం నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మొత్తాన్ని బడ్జెటరీ కేటాయింపు రూపంలో అందించనుంది.
కొత్త రాజధాని నిర్మాణంతోపాటు రాజభవన్, రాష్ట్ర సచివాలయం, శాసన సభ, హైకోర్టు నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం కింద నిధులు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలో పేర్కొంది. రూ.1500 కోట్లలో.. వెయ్యి కోట్ల రూపాయలు కొత్త రాజధానిలో అత్యవసర, మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు కేటాయించారు. రూ.500 కోట్లతో రాజ్ భవన్, సచివాలయం, శాసన సభ, హైకోర్టు తదితర భవనాలు నిర్మించనున్నారు.
కొత్త రాజధానిలో మౌలిక సదుయాల ఏర్పాటుకు అవసరమైన నిధుల కేటాయింపునకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిధుల కేటాయింపునకు సంబంధించిన పత్రాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సోమవారం కేంద్ర ఆర్థిక శాఖకు పంపించింది.

మరోవైపు, తెలంగాణకు రెండేళ్లలో నిరంతర విద్యుత్ అందచేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ సానుకూల వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర నివేదికను కోరింది. ఇప్పటికే ఈ పథకం అమలుకు గుజరాత్, ఏపీ రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. తెలంగాణలోను అమలు చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరడంతో సోమవారం కేంద్ర బృందం హైదరాబాద్ వచ్చి అధికారులతో చర్చిచారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సమస్యను అధిగమించడానికి కేంద్రం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి లేఖపై స్పందించిన ప్రధాని, కేంద్ర ఇంధన శాఖ ఉన్నతాధికారులను రాష్ట్రానికి పంపారు. దీనిపై అధికారులు భేటీ అయ్యారు. తెలంగాణలోని విద్యుత్ సమస్య, ప్రాజెక్టుల పైన తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ కేంద్ర అధికారులకు వివరించారు.












Click it and Unblock the Notifications