అమరావతి కోసం సమరానికి సై అంటున్న చంద్రబాబు .. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరుబాట
Recommended Video
ఏపీ రాజధాని అమరావతిని మార్చాలని వైసిపి ఆలోచన చేస్తుందంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజధాని దొనకొండకు మారుస్తున్న ట్లుగా జరుగుతున్న ప్రచారంతో రాజధాని రైతులు ఆందోళన బాట పట్టారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో ఏపీ రాజధాని అమరావతి పై పెను దుమారమే లేచింది. ప్రస్తుతం అది ఉద్యమ రూపం దాలుస్తుంది. ఇంతా జరుగుతున్నా సీఎం జగన్ మాత్రం రాజధాని విషయంలో నోరు ఎత్తకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

రాజధాని రైతులకు అండగా చంద్రబాబు పోరాటం
అమరావతిపై ఏపీ రాజకీయాల్లో దుమారం కొనసాగుతోంది. రాజధాని ముంపు ప్రాంతంలో ఉందన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడుతున్నారు. ముంపు ప్రాంతంగా చిత్రీకరించి రాజధానిని తరలించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని రైతులతో మాట్లాడిన చంద్రబాబు అనంతరం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. కావాలనే రాజధానిపై ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. రాజధానిని మార్చడానికి వీలు లేదని, కావాలనే రాజధాని ముంపు ప్రాంతమనే వాదన తీసుకొచ్చారని, రాజధాని రైతులకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.
రాజధాని కోసం కలిసొచ్చే పార్టీలతో కలిసి పోరాటం చెయ్యాలని బాబు నిర్ణయం
అంతేకాదు రాజధాని విషయంలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదింపులకు పార్టీ సీనియర్ నేతలతో ఒక కమిటీ వేయాలని నిర్ణయించిన చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. వైఎస్ఆర్ సర్కారుపై పోరుబాట పట్టిన చంద్రబాబు కలిసొచ్చే పార్టీలతో కలిసి రాజధాని విషయంలో అధికార పార్టీపై ఒత్తిడి తెస్తామన్నారు. అమరావతి రైతులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములతో నిర్మాణాలు చేపట్టామన్న చంద్రబాబు మొదట రాజధాని నిర్మాణంలో, భూసేకరణలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారని, ఇక ఇప్పుడు తాజాగా రాజధాని ముంపుప్రాంతమని కథలు చెబుతున్నారని, రాజధాని మార్చాలన్న ఆలోచనతోనే ఇదంతా వైసిపి అధినాయకత్వం చేస్తుందని మండిపడ్డారు. ఇక రాజధాని నిర్మాణంలో, భూసేకరణలో ఎక్కడా అవినీతి వెతికినా దొరకదని స్పష్టం చేశారు.

రాజధాని కోసం కార్యకర్తలు, నాయకులు ఉద్యమానికి సిద్ధమవ్వండి అని బాబు పిలుపు
వైసీపీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై పుస్తకాన్ని విడుదల చేయాలని ఈ సందర్భగా నిర్ణయించారు మాజీ సీఎం చంద్రబాబు. అంతేకాదు వైసిపి ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు కార్యాచరణ కూడా రూపొందించు కుంటున్నారు. ఏపీవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించాలని చంద్రబాబును నేతలు కోరగా అందుకు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే పర్యటన ఖరారు చేసుకుంటారని పార్టీలు వర్గాలు తెలిపాయి. ఏదేమైనా అమరావతి విషయంలో సమరానికి సై అంటున్న బాబు అమరావతిపై కార్యకర్తలు నాయకులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
ఇక ట్వీట్లో "రాజధాని అమరావతిపై వైకాపా మంత్రులు చేస్తున్న అనాలోచిత వ్యాఖ్యలకు రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్పష్టమైన ప్రకటన కూడా చెయ్యకపోవడం దుర్మార్గం. దీనిపై రాజధాని రైతులతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యకర్తలు, నాయకులు ఉద్యమానికి సిద్ధమవ్వండి." అంటూ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. దీంతో రాజధాని తరలింపుపై చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నట్టు అర్థం అవుతోంది.












Click it and Unblock the Notifications