నన్ను వేధిస్తున్నారు: గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన జగన్
హైదరాబాద్: తన దీక్షకు అనుమతి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేధిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం గవర్నర్‌తో జగన్ భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాపై ఈనెల 7న తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని గవర్నర్‌కు వినతి చేశారు.
ఈ నెల 7వ తేదీన తాను గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను, రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను ఆయన గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైయస్ జగన్ ఈ నెల 7వ తేదీ నుంచి గుంటూరులోని నల్లపాడు రోడ్డులో జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

ఇంతకు ముందు సెప్టెంబర్ 27వ తేదీన గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను తలపెట్టారు. అయితే, పోలీసులు దానికి అనుమతి ఇవ్వలేదు. దానిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టేస్తూ సాధారణ పద్ధతిలో రావాలని సూచించారు.
ఆ నేపథ్యంలో వైయస్ జగన్ తన దీక్షను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసుకున్నారు. దీక్షకు అనుమతి ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications