ఏపీ సీఎం కార్యాలయ ముట్టడి టెన్షన్ - పోరుగర్జన : ముందస్తు అరెస్టులు - నిర్బంధం..!!
ఏపీలో కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్)ను రద్దు డిమాండ్ చేస్తూ పోరు తీవ్రతరం అయింది. యుటిఎఫ్ ఆధ్వర్యాన పోరుగర్జనలో భాగంగా ఈ రోజున ఛలో సీఎం కార్యాలయానికి పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలనే డిమాండ్ తో ఈ నిరసనకు పిలుపునిచ్చారు. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారులను పూర్తిగా నియంత్రించారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇప్పటికే అనేక మందిని ముందస్తుగా అరెస్టులు చేసారు. గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి.

ముందస్తుగా గృహనిర్బంధం
ఉపాధ్యాయులకు సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పిడిఎఫ్ ఎమ్మెల్సీలను, యుటిఎఫ్ నాయకులను, ఉపాధ్యాయులను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేసారు. బైండోవర్ కేసులు నమోదు చేశారు. మరికొందరికి నోటీసులు ఇచ్చారు. విజయవాడలోని యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంతోపాటు జిల్లాల్లోని అన్ని యుటిఎఫ్ కార్యాలయాల వద్ద పోలీసులు ఆదివారం నుంచి మోహరించారు.
ఆయా కార్యాలయాల నుంచి ఎవరూ బయటకు రాకుండా అడ్డుకున్నారు. యుటిఎఫ్ నాయకుల, ఉపాధ్యాయుల ఇళ్ల వద్ద సైం నిఘా పెట్టారు. తాడేపల్లిలోని సిఎం ఇంటి నివాసానికి దగ్గరలో 16వ జాతీయ రహదారిపై నుంచి ఎవరూ కిందకు దిగకుండా ఉండేందుకు ముళ్ల కంచెలు వేశారు. విజయవాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముమ్మరంగా తనిఖీలు..
ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించే మార్గాల్లో చెక్‌పోస్టులు పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 2వేల మంది గృహనిర్బంధంలో ఉంచారు. రాఘవయ్య పార్కు వద్ద ఉన్న యూటీఎఫ్ కార్యాలయాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యమైన నేతలను అరెస్టు చేశారు. విజయవాడలో బందోబస్తు కోసం 2వేల మందిని నియమించారు.
రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.అక్రమ అరెస్టులను, గృహనిర్బంధాలను పలు ఉపాధ్యాయ సంఘాలు, సిపిఎస్ ఖండించాయి. సిపిఎస్ రద్దు కోసం యుటిఎఫ్ ఆధ్వర్యాన ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూడడాన్ని ఎపి ప్రధానోపాధ్యాయుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది.

సీఎం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటూ
ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమని యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ విమర్శించింది. సిపిఎస్ రద్దు చేసేలా ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసింవి. లేదంటే భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమాలను నిర్మిస్తామని యూనియన్ నేతలు హెచ్చరించారు.
సీపీఎస్ రద్దు కోసం ఉపాధ్యాయులు చేపట్టే చలో సీఎంవో కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 30, 144 అమలు చేశారు. ఆంక్షలను ఉల్లంఘించి వచ్చినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ టి.కాంతిరాణా స్పష్టం చేసారు.

సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భారీగా బలగాలు
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముందస్తుగా 650 మంది పోలీసులతో పకడ్బందీ బందోబస్తు చేపట్టారు. క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లోనూ పోలీసులు మోహరించి వాహనాలను క్షణ్నంగా తనిఖీ చేస్తున్నారు. అన్ని మార్గాల్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసారు. అయితే, ఉపాధ్యాయ సంఘాలు మాత్రం తాము నిర్ణయించిన విధంగానే కార్యక్రమం చేపడతామంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో.. సీఎం నివాస ప్రాంగణంలో ప్రతీ కదలిక పైన పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.












Click it and Unblock the Notifications