చంద్రబాబు..జగన్‌కు ప్రతిష్ఠాత్మకం : వార్ రూంల ఏర్పాటు : తరలి వస్తున్న వైసీపీ నేతలు..!
మరి కాసేపట్లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో ఈ ఎన్నికలు పార్టీలగా కంటే టీడీపీ..వైసీపీ అధినేతల వ్యక్తిగత ప్రతిష్ఠకు సవాల్‌గా మారింది. ఈ ఫలితాలు చంద్రబాబు..జగన్ రాజకీయ భవిష్యత్‌ను నిర్ధేశించనున్నాయి. దీంతో..ఈ ఇద్దరులో ఎవరు గెలిచినా అది వారి వ్యక్తిగత సమర్ధతే కారణం అవుతుంది. అదే విధంగా ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా..వారే బాధ్యులు కావాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ ఇద్దరి ఇమేజ్‌తో ఈ ఫలితాలు ముడి పడి ఉన్నాయి. దీంతో..ఇప్పుడు ప్రత్యేకంగా వార్ రూంలు ఏర్పాటు చేసుకొని ఫలితాలను సమీక్షిస్తున్నారు.
వార్ రూంల ఏర్పాటు..
ముఖ్యమంత్రి చంద్రబాబు..వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ తాడేపల్లిలోనే మకాం వేసారు. ఎన్నికల ఫలితాల సమీక్ష కోసం పార్టీ సీనియర్లతో వార్ రూంలు ఏర్పాటు చేసారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలోని ప్రజా వేదికలో ప్రత్యేకంగా ఫలితాల కోసం ఈ రూం సిద్దం చేసారు. ఇక్కడ టీడీపీ సీనియర్లు అందుబాటులో ఉంటారు. ఫలితాల సరళి పైన ఎప్పటికప్పుడు అధినేతతో చర్చిస్తారు. ఫలితాలకు అనుగుణంగా ఏ విధంగా వ్యవహరించాలనే దాని పైన అధినేతతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అదే విధంగా వైసీపీ అధినేత నూతన నివాసం- కార్యాలయంలో ప్రత్యేకంగా వార్ రూం సిద్దం చేసారు. ఇక్కడ పార్టీ సీనియర్లు విజయ సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రశాంత్ కిషోర్ తదితరులు కౌంటింగ్ సరళిని అధినేతకు నివేదిస్తారు. దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటంతో జగన్ తో చర్చల్లో పాల్గొంటారు.

తాడేపల్లికి వైసీపీ అభిమానులు
ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా వాస్తవ ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తున్న వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున ఉండవల్లికి తరలి వస్తున్నారు. ఫలితాలు వచ్చిన నియోజకవర్గాల అభ్యర్దులు వెంటనే ఉండవల్లిలో అందుబాటులో ఉండాలని పార్టీ ఆదేశించింది. దీంతో..వారు ఆశిస్తున్నట్లుగా ఫలితాలు ఉంటే సాయంత్రానికి జగన్ ను కలిసేందుకు 13 జిల్లాల నుండి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు..పార్టీ శ్రేణులు ఉండవల్లి తరలి వస్తున్నారు. టీడీపీ శ్రేణులు అధినేత అంచనాలకు తగినట్లుగానే ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. దీంతో..ఫలితాలు అనుకూలంగా వస్తే సంబరాలు చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇద్దరు అధినేతల వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించి ఫలితాలు ముడి పడి ఉండటంతో పాటుగా జాతీయ రాజకీయాల పైనా ప్రభావం చూపనున్నారు. దీంతో..ఇప్పుడు ఏపీతో పాటుగా తెలంగాణ ప్రజలు..జాతీయ నేతలు సైతం ఏపీ ఫలితాల పైన ఆసక్తిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications