చంద్రబాబు - పవన్ భేటీలో ఏం తేల్చారు: జనసేనకు 28-2, బీజేపీతో ఇలా..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాల పైన నిర్ణయాలు జరిగాయి. పొత్తులు ,ఉమ్మడి మేనిఫెస్టోపై సుదీర్ఘంగా చర్చించారు. లోకేష్ యువగళం సభకు హాజరు కావాలని చంద్రబాబు కోరటంతో పవన్ అంగీకరించారు. ఈ సభ ద్వారానే కీలక హామీల ప్రకటనకు నిర్ణయించారు. సీట్ల పైన నిర్ణయం జరిగింది.
కీలక నిర్ణయాలు : పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు కీలక అంశాల పైన చర్చించారు. కొంత కాలంగా సీట్ల ఖరారు పైన చర్చలు జరుగుతున్నా నిర్ణయానికి రాలేదు. తాజా సమావేశంలో జనసేనకు 28 అసెంబ్లీ .. 2 లోక్ సభ సీట్లు ఇచ్చేలా సూత్రప్రాయంగా ఒప్పందం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. అనకాపల్లి, మచిలీపట్నం లోక్ సభ స్థానాలు జనసేనకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా గాజువాక, భీమిలి, కాకినాడ, రాజమండ్రి రూరల్, భీమవరం, పిఠాపురం, అమలాపురం, రాజోలు, నర్సాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లి గూడెం, కైకలూరు, విజయవాడ పశ్చిమ, తెనాలి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, ఆళ్లగడ్డ, తిరుపతి, చిత్తూరు సీట్లతో పాటుగా మొత్తంగా 28 అసెంబ్లీ సీట్లు జనసేనకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.

మేనిఫెస్టోలో అంశాలు : ఇక, ఉమ్మడి మేనిఫెస్టో పైనా చర్చించారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో జనంలోకి వెళ్ళింది. జనసేన సూచించిన మరికొన్ని అంశాలతో కలిపి త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు. రాయలసీమ లేదా గుంటూరు కృష్ణా జిల్లాలో భారీ బహిరంగ సభ ద్వారా మేనిఫెస్టో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. మేనిఫెస్టెలో రెండు పార్టీల ప్రతిపాదనలతో పాటుగా రైతు రుణమాఫీ..ఉచిత విద్యుత్ వంటి అంశాలను చేర్చే విషయం పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం 10 అంశాలతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లనున్నాయి. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంబంధించి జనసేనాని కొన్ని సూచనలు చేసారు. వీటి పైన చర్చించి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు.

ఎన్నికల సమరశంఖం : ఇక, బీజేపీ నుంచి ఇప్పటి వరకు సానుకూల సంకేతాలు రాకపోవటం పైనా చర్చ జరిగింది. ఈ నెల 21న ఢిల్లీలో బీజేపీ ముఖ్య సమావేశం జరగనుంది. ఆ సమావేశం తరువాత ఏపీ రాజకీయాల పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ నెలాఖరు వరకు వేచి చూసి..జనవరి లో సంక్రాంతి వేళ టికెట్ల ప్రకటన..ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అదే సమయంలో ఈ నెల 20న జరిగే లోకేష్ యువగళం ముగింపు సభకు హాజరు కావటం లేదని తొలుత పవన్ సమాచారం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కోరటంతో పవన్ తన నిర్ణయం మార్చుకున్నారు. లోకేష్ యువగళం యాత్ర ముగింపు సభకు హాజరు కానున్నారు. ఈ సభా వేదిక నుంచే కీలక ప్రకటనలకు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications