ఇక సహించేది లేదు- చంద్రబాబు సీరియస్ వార్నింగ్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎవరి పనికి వారు పరిమితం కావాలని తేల్చి చెప్పారు. వాస్తవ పరిస్థితులు తమకు తెలియకుండా ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అంతా బాగుందనే తప్పుడు సమాచారం ఇచ్చినా సహించనని సీఎం తేల్చేసారు. అత్సుత్సాహం పనికి రాదని స్పష్టం చేసారు. పరిధి దాటి వ్యవహరిస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.
చంద్రబాబు ఆగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో కొందరు ప్రభుత్వ అధికారుల పని తీరు పైన వస్తున్న విమర్శల పైన చంద్రబాబు స్పందించారు. అధికారులు అత్యుత్సాహంతో తమ పరిధి దాటి రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వకుండా కట్టడి చేయాలని సీఎస్ కు సూచించారు. అధికారులు మీడియా ముందు పరిపాలన సంబంధిత అంశాలు మాత్రమే మాట్లాడాలని, రాజకీయ అంశాలు నాయకులు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. విశాఖ ఇసుక వ్యవహారంలో అధికారులు వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

సీఎంకు ఫిర్యాదులు
కొద్ది రోజుల క్రితం అనంతపురంలో రాముల వారి రథం తగలబడిన ఘటనలో అక్కడ ఎస్పీ చేసిన ప్రకటన చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. అదే విధంగా విజయవాడ వరదల సమయం లో కొందరు అధికారులు అత్యుత్సాహం తో చేసిన ప్రకటనలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించాయని మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. తాజా మంత్రివర్గ సమావేశానికి ప్రారంభం వేళ ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర మంత్రులు ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసారు. దీంతో.. ముఖ్యమంత్రి వెంటనే సీఎస్ కు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.
మద్యం టెండర్ల అంశంలో
మద్యం టెండర్ల అంశంలోనూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. టెండర్లలో ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక చేసారు. మద్యం టెండర్లలో కూటమి నేతల జోక్యం పైన మీడియాలో పెద్ద ఎత్తున కధనాలు వచ్చాయి. ఆ తరువాత సీఎంఓ స్పందించి నేతలెవరూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టత ఇచ్చింది. ఆ తరువాత రెండు రోజుల మద్యం దరఖాస్తులకు సమయం పొడిగించారు. నేటతో ఆ సమయం ముగియనుంది.












Click it and Unblock the Notifications