సీట్లు నిరాకరించిన నేతల పై చంద్రబాబు కీలక నిర్ణయం..!!
ఎన్నికల సమయంలో టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీలో పలువురు సీనియర్లకు ఈ సారి టికెట్లు దక్కలేదు. వారి మద్దతు దారులు ఆందోళన చేసారు. స్థానికంగా ప్రకటించిన అభ్యర్దులకు సహకారం అందటం లేదు. సీట్ల మార్పు కోసం ప్రయత్నించిన నేతలను పార్టీ నాయకత్వం బుజ్జగించే ప్రయత్నం చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో రెబల్ పోరు టెన్షన్ పెంచుతోంది. ఈ సమయంలో టికెట్ రాని నేతల విషయంలో చంద్రబాబు తాజా నిర్ణయం ఆసక్తి కరంగా మారింది.
కూటమి అభ్యర్దులు పోటీ చేస్తున్న పలు నియోజకవర్గాల్లో రెబల్స్ బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర, పశ్చిమ, చిత్తూరు జిల్లాల్లో పలువురు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి కొందర నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ నెల18వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. దీంతో..పార్టీలో సీట్ల దక్కని సీనియర్లను బుజ్జగించి ఎన్నికల సహకారం పొందేలా టీడీపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా టికెట్లు ఆశించి భంగపడిన వారికి పార్టీ పదవులు కేటాయించింది. కొత్తగా వచ్చిన నేతలకు సీట్లు..పార్టీ కోసం పని చేసిన తమకు ఇప్పుడు బాధ్యతలా అంటూ సీనియర్ల మద్దతు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా పార్టీ టికెట్లు నిరాకరించిన నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. గుంటూరు పశ్చిమం నియోజకవర్గ పరిశీలకుడిగా మల్లెల రాజేశ్ నాయుడుని నియమించింది. వైసీపీ నుంచి చిలకలూరిపేట అభ్యర్దిగా తొలుత ప్రకటించిన రాజేశ్ నాయుడిని తరువాత మార్చారు. దీంతో, ఆయన టీడీపీలో చేరారు. విడదల రజనీ పైన ఆరోపణలు చేసిన రాజేశ్ నాయుడిని ప్రస్తుతం రజనీ పోటీ చేస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా నియమించారు. అనంతపురం అర్బన్ సీటు ఆశించిన సీనియర్ నేత ప్రభాకర్ చౌదరి కి జోన్ 5 ఎన్నికల సమన్వయకర్తగా ప్రకటించారు. తనకు సీటు ఇవ్వకపోవటం పైన ప్రభాకర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేసారు. ఆయన మద్దతు దారులు అనంతపురం లో ఆందోళన చేసారు.
మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పను అనంతపురం, ఎమ్మెల్సీ బీటీ నాయుడిని కర్నూలు, ఏరాసు ప్రతాపరెడ్డిని నంద్యాల లోక్ సభ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారు. హిందూపురం సమన్వయకర్తగా తిప్పేస్వామి, పూల నాగరాజులకు బాధ్యతలు అప్పగించారు. ఆలూరు, పత్తికొండ అసెంబ్లీ స్థానాలకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు, ఎమ్మిగనూరుకు డాక్టర్ సంజీవ్ కుమార్, ఆళ్లగడ్డకు సబ్బారెడ్డి, విశాఖ ఉత్తర నియోజకవర్గానికి శీతంరాజ సుధాకర్, దెందులూరుకు దివి శివరాం, ఆత్మకూరుకు ఎస్సీవీ నాయుడు, ఉదయగిరికి వేనాటి సతీష్ రెడ్డి, పుట్టపర్తికి దాసరి నర్సింహ మూర్తి వీరితో పాటుగా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో పలువురికి స్థానం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications