బీజేపీతో ఒప్పందాలు ఇవీ - పార్టీ నేతలకు చంద్రబాబు క్లారిటీ..!!
ఏపీ రాజకీయాల్లో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. తిరిగి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీకి దిగుతున్నాయి. దాదాపు ఆరేళ్ల తరువాత తిరిగి టీడీపీ ఎన్డీఏ కూటమిలోకి చేరుతోంది. సీట్ల పంపకాల పైన సూత్రప్రాయంగా నిర్ణయం జరిగినా..అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీతో పొత్తు అవసరం..జరిగిన చర్చలు..తీసుకున్న నిర్ణయాల గురించి సొంత పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పార్టీ ముఖ్యులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా పొత్తులను ఖరారు చేసుకున్నారు. అమిత్ షా తో భేటీ తరువాత పొత్తు పైన పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీలో ఏం జరిగిందో వివరించారు. బీజేపీకి ఇచ్చే సీట్ల పైన సంకేతాలు క్లారిటీ ఇచ్చారు. ఎన్డీఎలోకి టీడీపీ చేరుతుందని స్పష్టం చేసారు. సీట్ల సర్దుబాటు కూడా కుదిరిందన్నారు. పొత్తులపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారు. బీజేపీకి 06 అసెంబ్లీ, 05 లోక్‌సభ సీట్లు ఇచ్చామని వెల్లడించారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్.. విభజన హామీలు నెరవేర్చడం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పుకొచ్చారు. సోమవారం మిగతా అభ్యర్దుల జాబితా ప్రకటన ఉండొచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.

పార్టీలో టిక్కెట్లు రాని, అసంతృప్తిగా ఉన్న వారిని వెంటనే సీనియర్లు.. పిలిపించి మాట్లాడాలని ముఖ్యనేతలకు చంద్రబాబు సూచించారు. టీడీపీ, జనసేనతో ఏపీలో బీజేపీ కలిసి పోటీ చేయటం పైన బీజేపీ నుంచి అధికారికంగా ప్రకటన రానుంది. సీట్ల పైన దాదాపు క్లారిటీ రావటంతో చంద్రబాబు, పవన్ తమ రెండో జాబితా విడుదలకు సిద్దం అవుతున్నారు. ఈ నెల 11న ఇద్దరు నేతలు రెండో జాబితా విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ తమ పార్టీ నుంచి 19 మంది, బీజేపీకి కేటాయించిన సీట్లను మినహాయించి టీడీపీ 51 స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేయాల్సి ఉంది. అదే విధంగా ఈ నెల 14న ఎన్డీఏ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు మరోసారి ఢిల్లీ రానున్నారు.












Click it and Unblock the Notifications