‘పట్టిసీమతో బాబుకు రూ. 300 కోట్ల ముడుపులు’
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాయలసీమపై చంద్రబాబుది సవతి ప్రేమని అన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు 9ఏళ్లలో రూ. 20కోట్లే ఇచ్చారని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుతో సిఎం చంద్రబాబుకు రూ. 300 కోట్ల ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు.
గురువారం ఆయన విజయవాడ ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. ఆ తర్వాత ఇంజినీర్లు, రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం ఎంతని ఇంజినీర్లను అడిగితే 30 టిఎంసిలని చెప్పారు. అంటే.. గోదావరి నది నీటిని ఇక్కడకు మళ్లిస్తే పట్టిసీమ దగ్గరనుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఎక్కడా కనీసం నీళ్లు నిల్వ చేసే సామర్థ్యం కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది' అని అన్నారు.
కృష్ణానది మాత్రమే గత ఏడేళ్లుగా దాదాపు 80-90 రోజులు పొంగుతోందనీ, సముద్రంలోకి నీళ్లు కలుస్తాయని అధికారులు చెప్పారని తెలిపారు. ఈ నీళ్లు కలిసేది కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రమేనని చెప్పారు. బుధవారం ధవళేశ్వరం, పోలవరం దగ్గర అడిగితే.. అక్కడ కూడా ఇంచుమించు ఇదే నెలల్లోనే నీళ్లు సముద్రంలో కలుస్తాయన్నారని తెలిపారు. రెండు నదులూ కూడా ఇంచుమించు ఒకే సమయంలో పొంగుతాయని చెప్పారు.

మన రుతుపవనాల కాలంలోనే నదులు పొంగి సముద్రంలోకి కలుస్తాయన్నారు. రాష్ట్రానికి ఏదైనా మంచి జరగాలంటే ఆ నదులు సముద్రంలో కలిసే సమయంలో.. నీళ్లు నిల్వచేసుకుని, తర్వాత వరద అయిపోయాక అవేనీళ్లు వాడుకునే ప్రాజెక్టే.. పోలవరం ప్రాజెక్టు అని చెప్పారు. అక్కడ 124 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉందని తెలిపారు. వరద తగ్గిన తర్వాత కూడా కుడికాల్వ ద్వారా 80 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా విశాఖ ప్రాంతానికి సుమారు 24 టీఎంసీల నీళ్లు ఇస్తుందన్నారు.
అలాంటి ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజిలో పడేసే పరిస్థితి కనిపిస్తోందని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సిన పనిలేదు, పనులు మొదలైతే చాలని అంటున్నారని చెప్పారు. పట్టిసీమ మొదలైతే 35 టీఎంసీల నీళ్లు మనకు రాకుండా పోతాయి.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మనకు పంపకుండా కట్టడి చేసే ప్రమాదం ఉందని తెలిసికూడా కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేయడానికే పట్టిసీమను చేపడుతున్నారని అన్నారు. పక్కనే పులిచింతల ప్రాజెక్టు ఉందనీ, దీని పనులు వైఎస్ఆర్ హయాంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని, దానికి చంద్రబాబు తొమ్మిదేళ్లలో కేవలం 24 కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. కాంట్రాక్టర్లకు మేలు చేయడంలో కోసమే రాయలసీమపై కపట ప్రేమ చూపిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications