సచివాలయాలకు చంద్రబాబు కీలక ఆదేశం - వాలంటీర్లకు సంకేతాలు..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల హామీల అమలు పైన ఫోకస్ చేసింది. తాజాగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించింది. ఇదే సమయంలో పెన్షన్ల పైన చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. పెన్షన్ల అమలు విషయంలో వార్డు, గ్రామ సచివాలయాలకు చంద్రబాబు తాజాగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో, ఇప్పుడు వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ వైఖరి పైన సస్పెన్స్ కొనసాగుతోంది.
చంద్రబాబు ప్రకటన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ రూ 4 వేలకు పెంచింది. ప్రతీ నెలా ఒకటో తేదీన సచివాలయ సిబ్బందితో పంపిణీ చేస్తుంది. తాజాగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మొదటి నెల, రెండోనెలా తీసుకోకున్నా.. మూడో మాసంలో స్వేచ్ఛగా తీసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఎవరైనా ఇవ్వకుంటే నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపిచ్చారు.గ్రామ .. వార్డు సచివాలయాల ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి గౌరవంగా పింఛన్ అందించాలని.. ఎవరైనా ఇంటి వద్ద కాకుండా ఆఫీసు వద్ద ఇస్తే వారి భరతం పడతానని హెచ్చరించారు.

సచివాలయాలకు ఆదేశాలు
ఈ నెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం పింఛన్ల పంపిణీ జరిగింది. ప్రతీ నెలా 64 లక్షల మందికి 2,400 కోట్ల చెల్లిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అయితే, గతంలో వైసీపీ హయాం లో వాలంటీర్లు పెన్షన్లను పంపిణీ చేసే వారు. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాల తో పలువురు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసారు. ఆ సమయంలో తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని.. వారి గౌరవ వేతనం రూ 10 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ ప్రతిపాదన అమలు దిశగా చర్చ జరిగింది. అయితే, అవసరమైన మేరకే వాలంటీర్ల సేవలను ప్రభుత్వ విభాగాలతో అనుసంధానం చేసి వినియోగించుకోవాలనే అభిప్రాయం వ్యక్తం అయింది.
వాలంటీర్లు కొనసాగేనా
ఇప్పుడు నాలుగు నెలల పాలన పూర్తయినా వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి.... పంచాయితీల పరిధిలోనే వారి సేవలు ఉండేలా మరో ఆలోచన పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను అందరినీ కొనసాగించాలా లేదా అనేది ఇంకా తుది నిర్ణయం జరగలేదు. దీంతో.. వాలంటీర్లు పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల హామీ అమలు చేయాలని నినదిస్తున్నారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి మరో సారి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందని చెప్పటంతో.. ఇప్పుడు వాలంటీర్ల గురించి తిరిగి చర్చ మొదలైంది. అసలు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా..ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications