రఘురామ సీటు పై బీజేపీకి చంద్రబాబు కీలక ప్రతిపాదన - అనపర్తి మార్పు...!!
ఏపీలో ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరింది. కూటమి అభ్యర్దుల సీట్లలో కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. టీడీపీలో చేరిన రఘురామ రాజు పోటీ చేసే స్థానం పైన బీజేపీకి చంద్రబాబు తాజాగా కీలక ప్రతిపాదన చేసారు. వివాదంగా మారిన అనపర్తి స్థానం టీడీపీకి ఇవ్వాలని..బదులగా బీజేపీకి తంబళ్లపల్లె ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. అయితే, రఘురామ సీటు విషయంలో చంద్రబాబు సూచన పైన బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సీట్ల మార్పు పై చర్చ
ఏపీలో కూటమి సీట్ల సర్దుబాటు పైన మూడు పార్టీల నేతలు సమావేశమయ్యారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరితో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ లు భేటీ అయి పలు అంశాల పైన చర్చించారు. ఆ సమయం లో ప్రస్తుతం సీట్ల మార్పు పైన టీడీపీ, బీజేపీలో చేసుకోవాల్సిన సర్దుబాట్ల పైన చర్చించారు.

అనపర్తి సీటు బీజేపీకి ఇవ్వటం పైన అక్కడ టీడీపీ అభ్యర్దిగా ప్రకటించిన నల్లిమిల్లి రామక్రిష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అపనర్తి సీటు తమకు కేటాయించాలని కోరగా..అందుకు బీజేపీ నేతలు తమకు ఉంగుటూరు సీటు ఇస్తే అనపర్తి వదులుకోవటానికి సిద్దమని చెప్పారు. ఉంగుటూరు సీటు జనసేనకు ఇవ్వటంతో తంబళ్లపల్లె ఇచ్చేందుకు సిద్దమని ప్రతిపాదించారు.
టీడీపీకి నర్సాపురం
అనపర్తి సీటు వదులుకొని తంబళ్లెపల్లె తీసుకోవటం పైన పార్టీ అధినాయకత్వంతో చర్చించి నిర్ణయం చెబుతామని బీజేపీ నేతలు వెల్లడించారు. నరసాపురం ఎంపీ స్థానం పైన చర్చ జరిగింది. నర్సాపురం సీటు బీజేపీ నుంచి శ్రీనివాస వర్మకు కేటాయించారు. ఈ భేటీలో చంద్రబాబు కొత్త ప్రతిపాదన చేసారు. నరసాపురం ఎంపీ సీటు తమకు విడిచిపెట్టాలని కోరారు.
ఆ సీటు రఘురామకు ఇస్తామని..ఈ స్థానంలో ఉండి సీటు బీజేపీకి ఇస్తామని ప్రతిపాదించారు. అయితే, ఎంపీ స్థానం కోరుతూ అసెంబ్లీ స్థానం ఇవ్వటం పైన బీజేపీ నేతలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నరసాపురం ఎంపీ స్థానం ఇవ్వటానికి సిద్దమైతే ఉండి నుంచి శ్రీనివాస వర్మకు సీటు ఇచ్చేలా చంద్రబాబు ప్రతిపాదన చేసారు. నరసాపురం ఎంపీ స్థానం తీసుకుంటే మరో ఎంపీ స్థానం బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుందనే చర్చ జరిగినట్లు సమాచారం.
ఉండి సీటు బీజేపీకి
దీంతో..ఈ ప్రతిపాదనల పైన బీజేపీ నేతలు పార్టీ అధినాయకత్వంతో చర్చించి తమ తుది నిర్ణయం చెప్పనున్నారు. ఇప్పటికే పార్టీ నేత సిద్దార్ధ సింగ్ నర్సాపురం ఎంపీ స్థానం ప్రధాని మోదీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీనివాస వర్మకు కేటాయించమని చెప్పుకొచ్చారు. అక్కడ అభ్యర్ది మార్పు ఉండదని స్పష్టం చేసారు.
తాజా చర్చల్లో సీటు మార్పు పైన చంద్రబాబు నుంచి ప్రతిపాదన రావటంతో ఇప్పుడు బీజేపీ నాయకత్వం తీసుకొనే నిర్ణయానికి అనుగుణంగా తుది నిర్ణయం జరగనుంది. దీని ద్వారా ఉండి స్ధానం రామరాజుకు ఉండే అవకాశం లేదనేది స్పష్టం అవుతోంది. దీంతో.. ఇప్పుడు ఉండి స్థానం బీజేపీ అంగీకరిస్తే శ్రీనివాస వర్మకు, అంగీకరించకుంటే రఘురామకు దక్కుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications