అమిత్ షాకు చంద్రబాబు లేఖ - నారాయణ అరెస్ట్ : న్యాయం చేయండి- రఘురామ ఉదంతం..!!
మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు లేఖ రాసారు. గవర్నర్ కు సైతం లేఖ పంపారు. అందులో ప్రధానంగా మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. రాజకీయ కక్ష్యతోనే నారాయణ అరెస్ట్ జరింగిందని షా కు రాసిన లేఖలో ఫిర్యాదు చేసారు. నారాయణ అరెస్ట్ ఘటనపైన జోక్యం చేసుకోవాలని..న్యాయం చేయాలని లేఖలో కోరారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు తరలింపులో జాప్యం వెనక దురుద్దేశం ఉందన్నారు. ఆ లేఖలో వైసీపీ ఎంపీ రఘురామ అరెస్ట్ ఉందంతాన్ని ప్రస్తావించారు.

రఘురామ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ
చిత్తూరు జిల్లా ఎస్పీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన పైన అనుమానాలు వ్యక్తం చేసారు. నారాయణపై తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని ఆరోపించారు. ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అరెస్ట్ చేశారని లేఖలో తెలిపారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు కు 8 -10 గంటల్లో చేరుకోవచ్చని..కానీ, రాత్రి వరకు చిత్తూరు తీసుకెళ్లలేదంటూ లేఖలో పేర్కొన్నారు. కోర్టులో వెంటనే ప్రవేశపెట్టకూడదన్న ఉద్దేశంతో కావాలనే చిత్తూరుకు తరలించడంలో జాప్యం చేశారని చంద్రబాబు ఆరోపించారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును సైతం కోర్టులో ప్రవేశపెట్టకుండా, పోలీసు కస్టడీలో ఉంచి ఇబ్బందులు పెట్టారని లేఖలో వివరించారు.

న్యాయం చేయాలంటూ అభ్యర్ధన
సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకొని..నారాయణకు న్యాయం చేయాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. ప్రాధమిక హక్కులను కాపాడాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా. .గవర్నర్ ను చంద్రబాబు అభ్యర్ధించారు. అయితే, చిత్తూరు తీసుకొచ్చిన నారాయణకు వైద్య పరీక్షలు చేసిన తరువాత పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. వ్యక్తిగత పూచీకత్తుతో మేజిస్ట్రేట్ సులోచనారాణి బెయిల్ మంజూరు చేశారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.

నారాయణకు బెయిల్
నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని నారాయణపై పోలీసులు అభియోగం మోపారని, కానీ 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు నారాయణ తరఫున న్యాయవాది వివరించారు. ఘటన జరిగిన నాటికి నారాయణ ఆ విద్యాసంస్థల అధినేత కాదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. అయితే, చిత్తూరు ఎస్పీ ఈ విచారణలో అందరూ గతంలో నారాయణ విద్యా సంస్థల్లో పని చేసిన సిబ్బందిగా తేలిందని..పూర్తి ఆధారాలతోనే నారాయణను అరెస్ట్ చేసామని వెల్లడించారు.