గుడివాడ రాజకీయంలో కొత్త ట్విస్ట్ - చంద్రబాబు కీలక నిర్ణయం..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. కీలక నియోజకవర్గాలపైన అధికార - ప్రతిపక్షాలు కొత్త లెక్కలతో ఎన్నికల యుద్దానికి సిద్దం అవుతున్నాయి. టీడీపీకి ఈ సారి ఎన్నికలు నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా మారుతున్నాయి. అదే సమయంలో టీడీపీ ఈ సారి కొన్ని నియోజకవర్గాల్లోని వైసీపీ నేతలను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో గుడివాడలో ఇప్పుడు కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. చంద్రబాబు నిర్ణయం కీలకంగా మారుతోంది.
గుడివాడలో టీడీపీ అంచనాలు : రానున్న ఎన్నికల్లో గుడివాడ నియోకవర్గం కీలకంగా నిలవనుంది. ఇక్కడి అభ్యర్ధులు..ఫలితం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంది. మాజీ మంత్రి కొడాలి నాని ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్ధిగా మరోసారి పోటీ చేయటం ఖాయమైంది. కొడాలి నాని వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొడాలి నానిని ఓడిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇక్కడ నుంచి టీడీపీ సీటు కోసం ఇద్దరు నేతల మధ్య పోటీ నెలకొంది. టీడీపీ సీనియర్ నేత రావి వేంకటేశ్వర రావు, ఎన్నారై వెనిగళ్ల రాము సీటు ఆశిస్తున్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు నియోజకవర్గం పరిధిలోని మూడు కీలక మండలాల నేతలతో ప్రత్యేకంగా సమావేశం ఆసక్తిని పెంచుతోంది.
సంప్రదింపులు మొదలు : గుడివాడలో టీడీపీ అభ్యర్ధిగా వెనిగళ్ల రాము పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి వచ్చిన హామీ మేరకే రాము కొంత కాలంగా నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలతో పాటుగా సేవా కార్యక్రమాల్లోనూ నిమగ్నమయ్యారు. రావి వెంకటేశ్వర రావుకు పార్టీలో సుముచిత ప్రాధాన్యత ఇవ్వటంతో పాటుగా..ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది.

ఇక్కడ అధికారికంగా అభ్యర్ధిని ఖరారు చేసే సమయంలో పార్టీకి చెందిన ముగ్గురు నేతలు కేశినేని చిన్ని, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ రాజు కు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. గుడివాడ నియోకవర్గంలోని పార్టీ నేతలతో ఈ ముగ్గురు చర్చలు చేయనున్నారు. రాము కు సీటు కేటాయిచటంతో పాటుగా రావి వర్గానికి దక్కే ప్రాధాన్యత పైన స్పష్టత ఇవ్వనున్నారు.
నాని వర్సస్ రాము : సంప్రదింపులు పూర్తయిన తరువాత..గుడివాడ అభ్యర్ధిగా రాము పేరు ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది. మూడు రోజుల పాటు ఈ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగనుంది. పార్టీ నిర్ణయించిన అభ్యర్ది గెలుపు కోసం అందరు సహకరించేలా ఈ ముగ్గురి సభ్యుల టీం పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనుంది. ఆ తరువాత పార్టీ అధినేత చంద్రబాబు అధికారికంగా వెనిగళ్ల రామును అభ్యర్ధిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. దీంతో, వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని వర్సస్ వెనిగళ్ల రాము మధ్య గుడివాడ అసెంబ్లీ పోరు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications