సీఎస్‌పై డైరెక్ట్ అటాక్ ప్రారంభించిన బాబు ! ఎల్వీ ఓవర్ చేస్తున్నారు .. టీటీడీ విషయంలో విచారణ ఎందుకు
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రధాని మోదీ..ఎన్నికల సంఘం..ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద ఫైర్ అయ్యారు. తాను ప్రధాని పదవికి ఆశావాహుడిని కాదని పేర్కొన్నారు. విపక్షాల్లో ప్రధాని అభ్యర్ది ఎవరని మోదీ ప్రశ్నిస్తున్నారని..ఎన్నికలు పూర్తయిన తరువాత తాము నిర్ణయం తీసుకుటామన్నారు. ఇక, ఎన్నికల సంఘం నియమించిన సీయస్ ఎల్వీ సుబ్రమణ్యం అతిగా స్పందిస్తున్నారని ఫైర్ అయ్యారు.

ప్రధాని పదవి ఆశించటం లేదు..
విపక్షాల్లో ప్రధాని అభ్యర్ది ఎవరని ప్రధాని మోదీ ప్రశ్నిస్తున్నారని..తమ అభ్యర్ది ఎవరో ఎన్నికలు పూర్తయిన తరువాత తాము ప్రధాని ఎవరో డిసైడ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఎన్నికల కోడ్ అమలు విషయంలో తమకు ఒక విధంగా..మోదీకి మరో విధంగా అమలు అవుతుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. తుఫాన్‌లు వచ్చినా ముఖ్యమంత్రులు సమీక్షలు చేయవద్దా అని నిలదీసారు. ప్రధానికి అడ్డు రాని కోడ్ ముఖ్యమంత్రులకు ఎందుకుంటూ ఈసీ తీరు పైన మండి పడ్డారు. ముఖ్యమంత్రులను అడుక్కొనే స్థాయికి దిగజార్చారని ఫైర్ అయ్యారు. పలు రాష్ట్రాల్లో ఈవీఎంల మొరాయింపు, విపక్షాలపై ప్రధాని మోదీ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. బెంగాల్‌లో ఏడు దశల్లో ఎన్నికలు పెట్టారని.. హింస, విధ్వంసాలతో పోలింగ్ శాతాన్ని దెబ్బతీసే కుట్రలు చేశారని ఆరోపించారు. యూపీలో ఎస్పీకి ఓటేస్తే బీజేపీకి పడ్డాయని పేర్కొన్నారు. అలాగే మధ్యప్రదేశ్, బెంగాల్‌లోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయని తెలిపారు.

మోదీ ఫ్రస్టేషన్ పతాక స్థాయిలో..
ప్రధాని మోదీ పైన చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 23న ఫలితం ఎలా ఉండబోతోందో ఇప్పుడే అర్థమైనట్లు ఉందని వ్యాఖ్యానించారు. అందుకే విపక్షాల ఉనికిని కూడా మోదీ సహించలేకపోతున్నారన్నారు. ప్రతిపక్షాలను చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేసారు. ప్రతిపక్షాలు కొత్త దుస్తులు కొనుక్కుంటున్నారని మాట్లాడుతున్నారని.. ఏదీ తోచక అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనే గంటకో డ్రెస్ మార్చి ఆర్భాటంగా రాజకీయాలు చేస్తున్నారన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌కో డ్రెస్సు.. లంచ్‌కి మరో డ్రెస్సు.. మధ్యాహ్నం ఇంకో డ్రెస్సు. మోదీ చెప్పిన మార్పు డ్రెస్సులు మార్చడంలోనే కనిపిస్తోందని ఎద్దేవా చేసారు. వీవీప్యాట్‌ల లెక్కింపు విషయంలో ఈసీ వాదన అసంబద్ధంగా ఉందని.. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశంపై మరోమారు కోర్టుకు వెళతామని స్పష్టం చేసారు.

ఎల్వీ అతిగా స్పందిస్తున్నారు..
ఎన్నికల సంఘం నియమించిన సీఎస్ అతిగా స్పందిస్తున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బంగారం రవాణా విషయంలో అతిగా స్పందించి విచారణకు ఆదేశించారని..అందులో అసలు తప్పు ఏం జరిగిందని ప్రశ్నించారు. అదే విధంగా ఫైబర్ గ్రిడ్ నష్టాల్లో ఉంటే మూసేస్తామని హెచ్చరిస్తున్నారని..అలాగైతే ప్రభుత్వాన్ని మూసేస్తారా అని నిలదీసారు. తన టీంలో ఉన్న అధికారులకు రక్షణగా తాము ఉంటామని చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం అదేశాలను అధికారులు పాటించటంలో తప్పు లేదని..అయితే ఎన్నికల సంఘం సైతం ప్రజలు ఇబ్బంది పడే విధంగా వ్యవహరించకూడదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications