చంద్రబాబు పథకాల అమలుతో జగన్ కు నష్టమేనా - కౌంటర్ ప్లాన్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పథకాల అమలు పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. జగన్ సూపర్ సిక్స్ హామీల అమలు పైన టార్గెట్ చేస్తున్న వేళ.. పథకాలను హామీ ఇచ్చిన విధంగా అమలు చేసేలా కసరత్తు చేస్తోంది. తల్లికి వందనం అమలుతో జగన్ ఓట్ బ్యాంక్ పైన గురి పెట్టింది. మిగిలిన పథకాలను అమలు చేస్తే జగన్ ఓట్ బ్యాంక్ గల్లంతేనా అనే చర్చ మొదలైంది. అయితే, ఇక్కడే జగన్ క్యాంపు కొత్త విశ్లేషణ ప్రారంభించింది.
పథకాల అమలుతో
జగన్ ను ఓడించటంలో 2024 ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా సూపర్ సిక్స్ హామీలు కీలక పాత్ర పోషించాయి. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయక పోవటం పైన జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. కాగా, ఇప్పుడు తల్లికి వందనం అమలు ద్వారా కూటమిలో కొత్త జోష్ కనిపిస్తోంది. జగన్ ఒక్క విద్యార్ధికే ఇవ్వగా... తాము ఎంతమంది ఉంటే అంత మందికి ఇవ్వటం ద్వారా రాజకీయంగా పై చేయి సాధించామని భావిస్తున్నారు. అదే విధంగా పెన్షన్లను చెప్పిన విధంగా రూ 4 వేలకు పెంచి ఇంటికే వెళ్లి ఇవ్వటం ద్వారా పెన్షన్ లబ్ది దారులు కూటమి వైపే మొగ్గు చూపుతారని లెక్కలు వేస్తున్నారు. అదే విధంగా రైతుల కోసం అన్నదాత సుఖీభవ అమలుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

జగన్ ఓట్ బ్యాంక్ పై గురి
జగన్ 2019-24 వరకు ప్రధానంగా తన సంక్షేమ పథకాల లబ్దిదారులే తనను తిరిగి గెలిపిస్తారని లెక్కలు వేసారు. ప్రతీ సందర్భంలోనూ తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే ప్రచారం చేసే వారు. అయితే, ఎన్నికల్లో మాత్రం జగన్ కు 11 సీట్లే దక్కాయి. జగన్ సంక్షేమ ఓట్ బ్యాంకు తమ వైపు తిప్పుకోవటానికే నాడు జగన్ ఇచ్చే దాని కంటే ఎక్కువ మొత్తంలో ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తిరిగి ఆ ఓట్ బ్యాంక్ జగన్ వైపు మళ్లకుండా హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నారు. మరో రెండు పథకాల అమలు పైన స్పష్టత రావాల్సి ఉంది. దీంతో, ఇక జగన్ ఓట్ బ్యాంక్ ను దెబ్బ తీసామనే భావనలో టీడీపీ నేతలు ఉన్నారు.
జగన్ లెక్కే వేరు
కాగా, జగన్ లెక్క మాత్రం వేరుగా ఉంది. చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమం అమలు కంటే ప్రచారం ఎక్కువగా ఉందని పార్టీ ముఖ్య నేతల వద్ద జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అదే విధంగా.. సూపర్ సిక్స్ తో పాటుగా చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు పైనా నిల దీసేందుకు జగన్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక.. తన హయాంలో చేసిన అప్పుల పైన కూటమి నేతలు చేసిన ప్రచారాన్ని జగన్ గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు చేసిన అప్పుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇక.. కూటమిలో చోటు చేసుకుం టున్న పరిణామాలు.. సామాజిక సమీకరణాలు.. పాలనా పరంగా వైఫల్యాలు ఇలా అన్నీ ఎన్నికల నాటికి ప్రభావం చూపుతాయనే విశ్లేషణలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. జగన్ కు ఎప్పడూ 40 శాతం ఓట్ బ్యాంక్ తగ్గని విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. దీంతో, రానున్న రోజుల్లో మిషన్ 2029 లక్ష్యంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications