జగన్‌పైన సానుభూతి..మన పైన కోపం కాదు: టీఆర్‌యస్ గురించి ఇలా: టీడీఎల్పీ నేతగా చంద్రబాబు..!
Recommended Video
ఏపీలో ఎన్నికల్లో ప్రజా తీర్పు పైన చంద్రబాబు స్పందించారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజల్లో జగన్ పైన ఉన్న సానుభూతి వైసీపీని గెలిపించిందని..అంతే కానీ టీడీపీ పైన ఉన్న కోపం కాదని చంద్రబాబు వివరించారు. కొద్ది రోజులుగా సాగుతున్న చర్చకు ముగింపు పలుకుతూ టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఫలితాల పైన ఆసక్తికర చర్చ సాగింది.
సానుభూతి మాత్రమే..కోపం కాదు..
ఏపీలో ఎన్నికల ఫలితాల పైన చంద్రబాబు పార్టీ నేతలతో విశ్లేషించారు. తాజా ఎన్నికల్లో పార్టీ నుండి గెలిచిన ఎంపీలు , ఎమ్మెల్యేలతో ఆయన సమావేవమయ్యారు. టీడీపీ నుండి గెలిచిన గణబాబు మినహా అందరూ హాజరయ్యారు. ఈ సమవేశంలో తొలుత టీడీఎల్పీ నేతగా చంద్రబాబు పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం కొత్తగా శాససభలో విపక్ష నేత..పార్టీ విప్ ఎవరికి అప్పగించాలనే దాని పైనా చర్చ సాగింది. అయితే, ఆ ఎంపిక బాధ్యతను చంద్రబాబుకు అప్పగిస్తూ సమావేశంలో తీర్మానించారు.

ఈ ఎన్నికల్లో జగన్ పైన సానుభూతి పని చేసిందని..అంతే కానీ టీడీపీ పైన ప్రజల్లో కోపం లేదని విశ్లేషించారు. టీడీపీ ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటుందని స్పష్టం చేసారు.కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని..వారు ఏ రకంగా తమ హామీలు అమలు చేస్తారో.. పాలన ఏరకంగా చేస్తారో చూడాలని.. ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషిద్దామని చంద్రబాబు సూచించారు.
ప్రజల తీర్పు భిన్నంగా ఉంది..
అయిదేళ్ల కాలంలో టీడీపీ ప్రజల మధ్యనే ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ అయిదేళ్ల కాలంలో ఏపీ అభివృద్దికి చిత్తశుద్దితో పని చేసామని చెప్పుకొచ్చారు. కాలంతో పరిగెత్తుతూ అనేక పనులు చేసామంటూ తాము చేసిన పనులను వివరించారు. తాము ఇంత చేసినా ప్రజల తీర్పు భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే సమయం లోనే చంద్రబాబు టీఆర్‌యస్ పైనా ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఒక్క సీటుతో ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్.. నేడు రెండోసారి కూడా అధికారం చేపట్టిందని గుర్తుచేశారు.

ప్రజా సమస్యలపై పోరాడుదామని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దామని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇక నుండి ప్రతీ రోజు గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మూడు గంటల పాటు నేతలు..కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చంద్రబాబు ప్రకటించారు. కార్యకర్తలకు దిక్సూచిగా నిలవాల్సిన బాధ్యత కొత్తగా గెలిచిన వారిపైన ఉందన్నారు.












Click it and Unblock the Notifications