అమరావతి రైతులకు బాబు హామీలు..! పోరుబాటు వేళ..!
ఏపీ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఆందోళనకు సిద్దమైన వేళ వారికి సీఎం చంద్రబాబు ఇవాళ కీలక హామీలు ఇచ్చారు. రాజధానికి సహకరిస్తున్న రైతుల్ని విస్మరించేది లేదన్నారు. రాయపూడిలో సీఆర్డీయే కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి రైతుల్ని కూడా ఆహ్వానించిన సీఎం.. వారితో పలు విషయాలు పంచుకున్నారు. తాజాగా ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తోందని రైతు జేఏసీ ఆరోపణలు చేసిన వేళ.. చంద్రబాబు హామీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ అనే కొత్త విధానాన్ని తెచ్చి సక్సెస్ చేశామని, ఈ ఘనత రైతులకు చెందుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా ల్యాండ్ పూలింగ్ విధానం లేదని, తామే ఈ విధానాన్ని తెచ్చామన్నారు. అమరావతి పనుల రీ-స్టార్ట్ తర్వాత మొదటిగా సీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. అమరావతి మహిళా రైతులు రోడ్డెక్కి పోరాడారని, అనేక ఉద్యమాలు చేశారని సీఎం గుర్తుచేశారు. రైతుల ఉద్యమానికి మద్ధతుగా తాను కూడా జోలె పట్టి అండగా నిలిచానని గుర్తుచేసుకున్నారు.

పడిన కష్టాలు మరిచిపోవద్దు, మీరు చేసిన త్యాగాల ఫలితాలను మీరే అనుభవించాలని చంద్రబాబు తెలిపారు. తాను దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానన్నారు. ఫేజ్-1లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చారని, దీంతో గత పాలకులు రైతుల్ని నానా హింసలు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. రాజధాని ఎడారి అన్నారని, వేశ్యల రాజధాని అన్నారని, ఎంతో అపహాస్యం చేశారని తెలిపారు. రైతులకు రెట్టింపు గౌరవం దక్కేలా, రెట్టింపు ఫలాలు అనుభవించేలా తాము చేస్తామన్నారు.
అమరావతి ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో నిర్మిస్తున్నామని, విమర్శలు చేసే వారంతా ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అమరావతి ఓ మునిసిపాలిటీగా మిగిలిపోకూడదంటే అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు అవసరమన్నారు. అమరావతి పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉంటుందన్నారు. రైతులు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే అనుకున్న లక్ష్యాలు సాధిస్తారన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారoభం కావాలన్నారు. అమరావతి అభివృద్ధికి ఆటంకాలు లేవని, అమరావతిని క్వాంటం వ్యాలీ చేస్తున్నామని, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోందని గుర్తుచేశారు. .

.అమరావతి రైతుల అభివృద్ధికి అండగా ఉంటామని, హ్యండ్ హోల్డింగ్ ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఒకసారి జరిగిన తప్పుకు రైతులు, తాను, రాష్ట్రం ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసన్నారు. మళ్లీ అలాంటి తప్పులు జరగకూడదన్నారు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలన్నారు. పవన్ కళ్యాణ్, బీజేపీలతో కలిసి ముందుకెళ్తున్నాం కాబట్టి మీరంతా సహకరించాలన్నారు. రాజధాని అమరావతి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉందని, దేశంలోని పవిత్ర దేవాలయాలు, మసీదులు, చర్చీల నుంచి మట్టి, జలాలు తెచ్చి శంకుస్థాపన చేశామని బాబు గుర్తుచేశారు. రాజధాని అభివృద్ధి కోసం ప్రతి రోజూ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానన్నారు. త్వరలో అమరావతి రైతులతో ప్రత్యేకంగా సమావేశం అవుతానని, రైతులను మరిచేదే లేదని, ఎలాంటి అనుమానం అక్కర్లేదని చంద్రబాబు తెలిపారు. అందరం కలిసి రాజధానిని అభివృద్ధి చేసుకుందామన్నారు.












Click it and Unblock the Notifications