తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా చర్చ: ఢిల్లీలో కలుసుకోనున్న ఇద్దరు చంద్రులు?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శనివారం న్యూఢిల్లీలో జరగనున్న నేషనల్ డెవెలప్‌మెంట్ కౌన్సిల్ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ హాజరు కావడమే ఇందుకు కారణం. ఈ సమావేశానికి రానున్న వీరిద్దరూ కలిసి అప్యాయంగా మాట్లాడుకుంటారా లేక ఎడమొహం, పెడమోహంగా ఉంటారా? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏపీకి చంద్రబాబు, తెలంగాణకు కేసీఆర్‌లు సీఎంలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎన్నికై రెండేళ్లు దాటినా వీరిద్దరూ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రారంభానికి విచ్చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులతో కలిసి హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో కేసీఆర్‌ను ఆహ్వానించారు.
ఆ తర్వాత కేసీఆర్ అక్కడ వెళ్లడం మనం చూశాం. అదే విధంగా కేసీఆర్ నిర్వహించిన ఆయుత చండీయాగానికి విజయవాడకు వెళ్లి సీఎం చంద్రబాబు అహ్వానించడంతో యాగానికి ఆయన వచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతి శీతాకాల విడిది సందర్భంగా గవర్నర్ నరసింహాన్ ఇచ్చిన విందుకు ఇద్దరూ కలిసి హాజరయ్యారు.

ఇటీవల కాలంలో తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ కేసీఆర్‌తో పాటు ఆయన మంత్రులు చంద్రబాబుపై ఏదో ఒక సందర్భంలో విమర్శిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టులు, హైకోర్టు విభజన పెద్ద సమస్యగా మారింది.
హైకోర్టు విభజనకు సంబంధించి చంద్రబాబుతో చర్చించేందుకు గవర్నర్ నరసింహాన్ ఇటీవలే ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ విజయవాడకు వెళ్లి వచ్చారు. విభజన చట్టంలో ఎన్నో సమస్యలు ఉండగా తెలంగాణ ప్రభుత్వం తమకు కావాల్సిన వాటిపైనే సమస్యలు సృష్టిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే.
విభజన చట్టం ద్వారా పరిష్కారం కాని సమస్యలను కనీసం హైకోర్టు అన్నా పరిష్కరిస్తుందనే ఉద్దేశంతోనే హైకోర్టు విభజనకు చంద్రబాబు సుముఖంగా లేరని తెలంగాణ న్యాయవాదుల ఆందోళన సందర్భంగా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య కొంత నిశబ్ధ వాతావరణం నెలకొంది.
ఇద్దరి మధ్య అంత సఖ్యత లేకపోయినా ఢిల్లీ వేదికగా జరుగుతున్న నేషనల్ డెవెలప్‌మెంట్ కౌన్సిల్ సమావేశంలో వీరిద్దరూ కలుసుకోబోతుండటంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో రాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.