
వైఎస్ జగన్ పై సైలెంట్‌గా మైండ్‌గేమ్ ఆడుతున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్?
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనే విషయంలో ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబునాయుడుకానీ, పవన్ కల్యాణ్ కానీ స్పష్టతనివ్వలేదు. ఈ విషయంలో రెండు పార్టీల శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు పొత్తులకు సిద్ధమని జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్‌కల్యాణ్ ప్రకటించారు.
మహానాడు, మినీ మహానాడు, బాదుడే బాదుడు కార్యక్రమాలకు ప్రజల నుంచి ఊహించనిరీతిలో స్పందన వస్తుండటంతో పొత్తులపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ అధికార ప్రతినిధులకు, సీనియర్ నేతలకు టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీచేసింది.

కలిసి పోటీచేస్తే అధికారం సులువేనా?
తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేస్తే అధికారం చేజిక్కించుకోవడం సులువేననే అభిప్రాయం రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఈ రెండూ కలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టమనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యక్తపరుస్తున్నారు. గత ఎన్నికల్లో లభించిన ఓట్ల వ్యత్యాసం ఈ విషయాన్ని చెబుతోందని ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే పొత్తులకు సంబంధించి ఎప్పుడు బహిరంగంగా మాట్లాడాలి? తదుపరి చర్యలేంటి? లాంటి విషయాలపై అటు చంద్రబాబుకు, అటు పవన్‌కు ఒక అవగాహన ఉందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

విడివిడిగా బలోపేతంపై దృష్టి
ప్రస్తుతానికి తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు విడివిడిగా ప్రజల్లోకి వెళ్లి బలోపేతమవడంపై దృష్టిసారించాయి. ఎవరికి వారు విడిగా బలం పెంచుకొని ఎన్నికల సమయానికి పొత్తులపై ప్రకటన చేయాలనే యోచనలో ఉన్నాయని, రెండు పార్టీల బలంతో అత్యంత సులువుగా వైసీపీని ఎదుర్కోవచ్చనే ప్రణాళికను అమలు చేస్తున్నాయని భావిస్తున్నారు.
టీడీపీ, జనసేన రాజకీయ కార్యకలాపాలను నిశితింగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవతుందని సీనియర్ రాజకీయవేత్తలు వెల్లడిస్తున్నారు. పొత్తులు ఉంటాయని ఇప్పుడే ప్రకటిస్తే సీట్ల కోసం పోటీ ఉంటుందని, సీట్లు ఆశించేవారు వైసీపీవైపు చూసే చూస్తారని, దీనివల్ల అనవసరంగా ఆ పార్టీ బలం పెంచినట్లవుతుందనే ఉద్దేశంతో ఇరుపార్టీల అధినేతలున్నారు.

నష్టం కలగకుండా జాగ్రత్తపడుతున్న అధినేతలు
పొత్తులవల్ల సీటు ఆశించి భంగపడే నాయకులు దూరమవుతారని, అలా కాకుండా ప్రజల్లో బలోపేతమైతే ఆ తర్వాత పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయేవారి నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను, వారివల్ల కోల్పోయే ఓట్లవల్ల ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలనే వ్యూహం కూడా ఇందులో దాగివుంది.
రాష్ట్రంలో ఎవరు సర్వే చేసినా వైసీపీని, టీడీపీని, జనసేనను విడివిడిగా చేస్తున్నాయి. అలా కాకుండా టీడీపీ-జనసేన కలిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఇంతవరకు సర్వే జరగలేదు. కానీ ఈ రెండు పార్టీలు కలవడంవల్ల వైసీపీని అధికారానికి దూరం చేస్తామనే నమ్మకాన్ని మాత్రం తెలుగుదేశం, జనసేన శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.