చంద్రబాబు, పవన్ ఉమ్మడి సభలు - షెడ్యూల్ ఖరారు, ఆపరేషన్ వైసీపీ..!!
ఎన్నికలకు ఏపీలో పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే ఇటు సీఎం జగన్..అటు చంద్రబాబు అభ్యర్దుల ఖరారు కోసం కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్రబాబు గతం కంటే భిన్నంగా అభ్యర్దుల ఎంపికలో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి సభలకు కార్యాచరణ సిద్దమవుతోంది. వైసీపీని లక్ష్యంగా చేసుకొని ఇద్దరు నేతల్లో ప్రజల్లోకి వెళ్లనున్నారు.
చంద్రబాబు జిల్లాల పర్యటన : సెప్టెంబర్ లో చంద్రబాబు స్కిల్ కేసులో జైలుకు వెళ్లిన సమయం నుంచి జిల్లాల పర్యటనలకు బ్రేక్ పడింది. ఇక..ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు. జనవరి ఐదో తేదీ నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఒక్కో సభ చొప్పున మొత్తం పాతిక సభల్లో ఆయన పాల్గొంటారు. రోజుకు రెండు సభల చొప్పున జనవరి నెలాఖరుకల్లా వీటిని పూర్తి చేయాలని టీడీపీ భావిస్తోంది. ఒక్కో లోక్‌సభ స్థానంలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సభ పెడతారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు పర్యటన మొదలవుతుంది. 5న తణుకులో సభ జరుగుతుంది. ఏడో తేదీన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో.. కృష్ణా జిల్లా గుడివాడ లేదా గన్నవరంలో సభలు జరుగుతాయి.

పవన్ తో కలిసి సభల్లో : చంద్రబాబు సభల్లో రెండు చోట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం.. జనవరి 11న నరసరావుపేటలో జరిగే సభకు ఆయన హాజరవుతారు. చివరిలో అనంతపురం జిల్లాలో జరిగే సభలో కూడా జనసేనాని పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ఎన్నికల హామీలకు విస్తృత ప్రచారం కల్పించడానికి పర్యటనలను వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. పర్యటనల సమయంలోనే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సీట్ల వ్యవహారం పైన ప్రస్తుతం రెండు పార్టీల్లోనూ కసరత్తు జరుగుతోంది. సంక్రాంతి వేళ తొలి జాబితా విడుదల చేస్తారని చెబుతున్నారు.













Click it and Unblock the Notifications