నెయ్యి వివాదంపై చంద్రబాబు కీలక నిర్ణయం-సిట్ రిపోర్ట్ పై కమిటీ..!
వైసీపీ హయాంలో జరిగిన తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్న లోపాల్ని అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఏక సభ్య కమిటీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇవాళ ఎన్డీయే కూటమి నేతల భేటీ తర్వాత ప్రకటించారు. ఏకసభ్య కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని, తప్పు చేసిన వారిని వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సిట్ రిపోర్ట్ పై ఏకసభ్య కమిటీ (chandrababu)
సిట్ రిపోర్ట్ పై ఏకసభ్య కమిటీ అధ్యయనంతో వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. తిరుమలలో లడ్డూ నెయ్యి కల్తీ జరిగిందని 2022లోనే సీఎఫ్ టీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చినా అప్పటి వైసీపీ ప్రభుత్వం తొక్కిపెట్టిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తాను సీఎం కాక ముందే దీనిపై పోరాటాలు చేశానని గుర్తుచేశారు. తాను సీఎం కాగానే టీటీడీ ప్రక్షాళన మొదలుపెట్టానన్నారు. అలాగే లడ్డూ శాంపిళ్లు తీసి ఎన్డీడీబీకి పంపామని, సిట్ నివేదిక చూస్తే అన్ని రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి తయారు చేసినట్టు వెలుగు చూసిందన్నారు. భగవంతుడు అంటే లెక్కలేని తనంగా వ్యవహరించారని, హైందవం పట్ల విశ్వాసం లేకపోతే ఇలా చేస్తారా?అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలా దుర్మార్గం, మహా పాపం చేశారన్నారు.

శ్రీవాారితో ఆటలాడుకున్న వైసీపీ
చరిత్రలో శ్రీవేంకటేశ్వర స్వామితో ఎవరూ ఆటలాడుకోలేదని, బ్రిటీషర్లు కూడా సంప్రదాయాలు, ఆచారాలను పాటించారన్నారు. వాళ్లకంటే హీనంగా గత పాలకులు వ్యవహరించారన్నారు. బూతులు తిట్టినా భరించానని, వారు ఏం చేసినా నిస్సహాయంగా మిగిలిపోవాలా? అని అడిగారు. సీబీఐ నివేదికలో ఎక్కడా కల్తీలేదని నిర్ధారించలేదు. కరడు గట్టిన నేరస్తులు అసత్యాన్ని ఎలా నమ్మించాలో ప్రయత్నిస్తారన్నారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఈ తరహా విషయాలను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. తిరిగి ఈ తరహా మహాపచారం చేయాలంటే భయపడాలి. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వదిలిపెట్టబోమన్నారు.

వైసీపీకి క్లీన్ చిట్ ఎవరిచ్చారు?
లడ్డూ కల్తీ చేసిందే కాకుండా ఇప్పుడు మళ్లీ ఎదురుదాడి చేసి, జరిగిన ఘటనను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. ప్రజల తరపున తిరుమల పవిత్రతను కాపాడతాం, అదే మాధవ సేవ అన్నారు. ఈ అంశంపై ఇతర పీఠాధిపతులలోనూ చర్చించి ముందుకు వెళ్తామన్నారు.
నెయ్యి కల్తీ జరగలేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని నివేదికలో ఎక్కడుంది.? ఏమైనా కలకన్నారా.? వాళ్లకు దేవుడు వచ్చి చెప్పారా.? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications